ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదవాలి : కలెక్టర్ రాజర్షి షా

by Disha Web Desk 15 |
ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదవాలి : కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, మెదక్ ప్రతినిధి : ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గ్రూప్ 2,3,4 ఉద్యోగాలకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మూడు మాసాల పాటు ఎస్సీ అభ్యర్థులకు ఇచ్చే ఉచిత శిక్షణ ఫౌండేషన్ ప్రారంభించిన అనంతరం జ్యోతిని వెలిగించి, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై లో జరిగే పోటీ పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నందున టీవీ, సినిమా, ఫోన్​లకు దూరంగా ఉండి కష్టపడి చదవాలని సూచించారు. ముందుగా సిలబస్ ఏముందో చూసుకొని, ఎలా చదవాలో మదిలో ఒక అవగాహనకు రావాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతామన్నారు.

ఉన్నత ఉద్యోగమే లక్ష్య సాధనగా అభిరుచి, కోరిక మేరకు స్టడీ సర్కిల్ ఇచ్చే మెటీరియల్ తో పాటు ఆన్ లైన్ ద్వారా వివిధ పుస్తకాలను అధ్యయనం చేయాలని, చదువుతో పాటు క్లుప్తంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలని, కంబైన్డ్ స్టడీ చేయాలని సూచించారు. మెంటల్ అబిలిటీ , కరంట్ అవైర్స్ పై అవగాహన పెంపొందించుకోవాలని, గత పరీక్షల పేపర్లను తిరగేసి క్వక్షన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీ చే వంద మంది అభ్యర్థులకు మూడు మాసాల పాటు శిక్షణతో పాటు 1500 రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్ ఇస్తూ ఒక్కో అభ్యర్థికి 6,750 ల చొప్పున ప్రభుత్వం స్టైపండ్ ఇస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ప్రోగ్రాం డైరెక్టర్ విక్రమ్ పాల్గొన్నారు.


Next Story