సంచలనాల ’దిశ’.. భూ కుంభకోణం పై విచారణ షురూ

by Disha Web Desk 12 |
సంచలనాల ’దిశ’..  భూ కుంభకోణం పై విచారణ షురూ
X

దిశ, పటాన్‌చెరు : ఐలాపూర్ భూ అక్రమాలపై ‘దిశ’ పత్రిక ప్రచురిస్తున్న వరుస కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఐలాపూర్ వివాదాస్పద భూముల్లో పేదల ఇండ్ల కూల్చివేత వ్యవహారంతో పాటు పెద్దల నిర్మాణాలకు మినహాయింపుపై ‘దిశ’ వరుస కథనాలను ప్రచురిస్తూ వస్తుంది. రెండేళ్లుగా కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూముల్లో కొందరు అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను చేసి విక్రయించారు. ఈ ప్లాట్లను కొన్న పేదలు గృహాలను నిర్మించుకుని నివాసముంటుండగా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా 300 ఇండ్లను కూల్చి పేదలను నిరాశ్రయులను చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే ఈ అంశాన్ని ప్రచురించడమే కాకుండా అక్రమ భూ రిజిస్ట్రేషన్ల బాగోతాన్ని ‘దిశ’ సంచలన కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరోవైపు కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ‘దిశ’ను ప్రజలు అభినందిస్తున్నారు. అన్నిశాఖల అధికారుల అలసత్వం, అక్రమార్కుల మోసాలపై వస్తున్న కథనాలకు ఉన్నతాధికారులు కదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భూ వ్యవహారంపై విచారణ షురూ చేశారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రధానంగా సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ, పంచాయతీ అధికారుల అక్రమాలపై అధికారులు నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ రెండు సంవత్సరాలలో అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరు ఆ సమయంలో ఏ ఏ శాఖలలో ఏ అధికారులు విధులు నిర్వహించారన్న కోణంలో విచారణ చేపట్టారని సమాచారం. రాష్ట్ర ఇంటెలిజెన్స్, విజులెన్స్ సైతం ఎప్పటికప్పుడు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

అధికారుల గుండెల్లో పరుగులు..

ఐలాపూర్ భూ భాగోతం పెద్ద ఎత్తున వివాదాస్పదం కావడంతో అక్రమార్కులకు సహకరించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా బడా బాబులకు అండగా నిలిచి తప్పుడు సర్వే నెంబర్‌లతో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు మూలమైన సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ లో అక్రమార్కులకు సహకరించి కోట్ల రూపాయల విలువైన భూములను అప్పనంగా అప్పచెప్పిన అధికారుల కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం. వివాదాస్పద భూములు రెండు సంవత్సరాలుగా నిర్మాణాలు జరుగుతున్న సమయంలో అమీన్ పూర్ ప్రాంతంలో వీధులు నిర్వహించిన రెవెన్యూ అధికారుల వివరాలను కూపీ లాగుతున్నట్లు తెలుస్తున్నది.

ఐలాపూర్‌లో భూముల్లో అక్రమ నిర్మాణాలను విరివిగా అనుమతులు ఇచ్చి నిర్మాణాలను ప్రోత్సహించిన పంచాయతీ అధికారులపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడవుతుంది. అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు జారిచేయడం, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో సహకరించిన అధికారులతో పాటు అందుకు ఒత్తిడి తెచ్చిందేవరు అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అక్రమార్కుల పై ఆరా..

అమాయకులైన పేదలకు భూముల్ని అమ్మి వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్న పెద్దల సమాచారం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ భూ కుంభకోణం వెనుక చక్రం తిప్పింది ఎవరనే కోణంలో ఇప్పటికే వివరాలు సేకరించినట్లు సమాచారం. కొందరు అక్రమార్కులు మధ్యవర్తులను నియమించుకుని భారీ కుట్రకు పాల్పడిన వారి వివరాలను సైతం బాధితుల ద్వారా సేకరిస్తున్నారని సమాచారం వస్తుంది.

పెద్దల నిర్మాణాల పై విచారణ

కిష్టారెడ్డి పేట పంచాయతీ నుంచి అనుమతులు పొంది ఐలాపూర్ సర్వే నెంబర్ 208 భూములలో నిర్మాణాలు జరిపిన వివరాలు సేకరిస్తున్నారు. కూల్చివేతలకు ఒక రోజు ముందు సదరు నిర్మాణదారులు కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని కూల్చివేతలను అపడంతో ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఒక భూమిలో అనుమతులు తీసుకుని వేరే గ్రామ భూమిలో నిర్మాణాలు చెయ్యడమే కాకుండా కోర్టును సైతం తప్పుదోవ పట్టించి తమకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకోవడం పై అధికారులు మండిపడుతున్నారు.

ఈ నిర్మాణాలపై ఎక్కడెక్కడ చర్యల విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ వారి సూచనలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసేలా వ్యవహరించిన పెద్దల నిర్మాణాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం వస్తుంది. ఏదేమైనా వందల కోట్ల రూపాయల భూ కుంభకోణం పై అధికారులు విచారణ జరిపి కారకులపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed