తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు వేగవంతం చేయాలి: రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఐఏఎస్

by Kodari Anjali |

తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ జూన్ 15 న ప్రారంభం కానుంది.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు వేగవంతం చేయాలి: రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఐఏఎస్
X

దిశ, ములుగు: తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ జూన్ 15 న ప్రారంభం కానుంది. అవసరమైన పనులు యుద్ధ ప్రాతపదికన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్సీఈ ) ఐఏఎస్ నవీన్ నికోలస్ సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు. మంగళవారం విద్యాశాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి మర్కుక్ మండల కేంద్రంలోని పోలీస్ సిబ్బందికి నిర్మించిన క్వార్టర్స్‌ను ఆయన పరిశీలించి పాఠశాల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రంలో ఏర్పాటు కానున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధి పనులను ఉన్నతాధికారులు సమీక్షించిన అనంతరం, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులకు ఆధునిక ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు...

పాఠశాలలో స్మార్ట్ తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, సైన్స్, కంప్యూటర్ ప్రయోగశాలలు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశాలమైన క్రీడా మైదానాలు, ఇండోర్ గేమ్స్ సదుపాయాలు, సమృద్ధిగల గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రీ-ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు సమగ్ర విద్యా విధానాన్ని అమలు చేయడంతో పాటు విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించే కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పాఠశాల నిర్వహణ కోసం ఇద్దరు ప్రీ-ప్రైమరీ ఉపాధ్యాయులు, ఏడుగురు ఎస్‌జీటీలు, ఏడుగురు స్కూల్ అసిస్టెంట్లు, ఒక పీఈటీ, ఒక పీడీ నియామకానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల రవాణా సౌకర్యంతో పాటు ఈ నెల 15వ తేదీ నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్న ఈ పాఠశాల ప్రభుత్వ విద్యా రంగంలో నాణ్యతను మరింత పెంచే ఆదర్శ విద్యాసంస్థగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story