పేటలో జోరుగా మట్కా!

by Dishanational1 |
పేటలో జోరుగా మట్కా!
X

దిశ, సదాశివపేట: సదాశివపేటలో జోరుగా మట్కా జూదం కొనసాగుతుంది. పట్టణంలో పలు ప్రధాన కూడళ్లను అడ్డాలుగా చేసుకుని కొందరు మట్కా ఏజెంట్లు జూదాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకు సదాశివపేట నుంచి లక్షలాది రూపాయలు మట్కా నిర్వాహకులకు వెళ్ళిపోతున్నాయి. మహారాష్ట్రకు చెందిన కళ్యాణి, మిలాన్ అనే ఈ రెండు సంస్థలు మట్కా జూదాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ జూదంలో చాలామందికి సంబంధాలు ఏర్పాటు చేసుకుని సాగిస్తున్నట్లు ప్రచారం. ఈ మట్కా జూదానికి ఒకటి నుంచి పది వరస సంఖ్యలు ఉంటాయి. అందులో మట్కా రాయాలనుకున్నవారు ఏదో ఒక నెంబర్ ను ఎంపిక చేసి ఆ నెంబర్ పై డబ్బులు చెల్లిస్తారు. ఉదాహరణ 100 రూపాయలకు 900 రూపాయలు వస్తాయని నమ్మకంతో మట్కా జూదంలో పెడుతున్నారు. ఇలా వందల్లో కాకుండా వేళల్లో డబ్బులు పెట్టి దివాలా తీసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ నెంబర్లు ఓపెన్, క్లోజ్ అని రెండు సార్లు డబ్బులు కట్టించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో కాగితాలపై నెంబర్లు రాసి డబ్బులు కట్టేవాళ్ళు టెక్నాలజీ పెరగడంతో సెల్ఫోన్ల ద్వారా వాట్సాప్ లలో గ్రూపులుగా ఏర్పడి నెంబర్లను ఎంపిక చేసి మట్కా ఆడుతున్నారు. పట్టణంలో సుమారు 60 శాతం మంది ఈ మట్కా జూదంలో డబ్బులు పోగొట్టుకుని దుర్భరంగా మారిన సందర్భాలు ఉన్నాయి.

పట్టణంలోని ప్రధాన కూడలీలు అయిన గాంధీ చౌక్, సిద్దాపూర్ గౌని, ముర్షద్ దర్గా, గురు నగర్ కాలనీ, పాత కేరి, మార్కెట్ యార్డ్ ప్రాంతాలే కాకుండా సందులలో, ఊరి బయట, చెట్ల కింద రహస్యంగా మట్కా జూదాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఫోన్ల ద్వారా సమాచారాన్ని ఇచ్చుకుంటూ డబ్బులను ఆన్ లైన్ పేమెంట్ చేసుకుంటున్నారు. రోజూ కూలీ పని చేసుకునేవారే కాకుండా బడా వ్యాపారుల వరకు ఈ మట్కా వ్యాపారం జోరందుకుంది. గతంలో కొందరు ఏజెంట్లను గుర్తించి కేసులు నమోదు చేసి వదిలేసినప్పటికీ వారి తీరు మారలేకపోతుంది. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం మట్కా ఏజెంట్లకు మామూలు అయిపోయింది. కొందరు వ్యాపారులు మట్కా జూదంలో లక్షల రూపాయలు పెట్టి ఊరు వదిలిన సందర్భాలు ఉన్నాయి. ఆ సంసారాలు ప్రస్తుతం అతిగతి లేకుండా దుర్భరంగా జరుపుతున్నారు. ఈ మట్కా జూదంపై పోలీసు యంత్రాంగం నిఘా పెంచి అరికట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed