ఇల్లీగల్ 'ఫార్ఛ్యూన్'... ఖాసీంపూర్‌లో ఫామ్ ప్లాట్ల దందా

by Dishanational1 |
ఇల్లీగల్ ఫార్ఛ్యూన్... ఖాసీంపూర్‌లో ఫామ్ ప్లాట్ల దందా
X

సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ బ్రోచర్లు పంపిణీ చేస్తున్నారు. విశాలమైన రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ, రెరా అనుమతుల్లేకుండానే ప్లాట్లు విక్రయిస్తున్నారు. కనీసం నాలా కన్వర్షన్ చేయకుండానే రికార్డుల్లో, బ్రోచర్లలో ప్లాట్లు చేసి గుంటల లెక్కన అమ్మేస్తున్నారు. ఫాం ప్లాట్ల లెక్కన జనానికి అంటగట్టేస్తున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వెంచర్లు అని, వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని తెలిసినా పట్టించుకోవడం లేదు. కనీసం క్షేత్ర స్థాయికి వెళ్లి భూమిని పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోనే..

దిశ, తెలంగాణ బ్యూరో: జహీరాబాద్ మండలం ఎస్ఎస్ఎల్ ఫార్చ్యూన్ విలేజ్ పేరిట ఫామ్ ప్లాట్లు అమ్మకానికి పెట్టారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్ ఆఫ్ తెలంగాణకు అత్యంత సమీపంలోనే వెంచర్ ఉంది. 90 డేస్ ప్రోగ్రాం అంటూ ప్రచారం చేస్తున్నారు. పక్కా వాస్తు. 40 అడుగులు, 33 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనైజీ, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్కులు, 24/7 సెక్యూరిటీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, జాగింగ్ ట్రాక్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, ముంబై హైవే, ఎమ్మాఆర్ఎఫ్ ప్లాంట్, మహీంద్రా, ఇక్రిశాట్, ఓక్సెన్ యూనివర్సిటీ ఇవన్నీ పక్కనే.. ఇలా ఒక్కటేమిటి సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్పెసిఫికేషన్ చూస్తే ఎంత మంచి వెంచర్ అనుకోవడం సహజం. సకల సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు అనుమతులు కూడా ఉంటాయనుకుంటే పొరపాటే. డీటీసీపీ, రెరాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అసలు ఆ అవసరమే లేదంటున్నారు. ఇక అధికారులే వాస్తవాలను పరిశీలించాలి.

900 ప్లాట్లు అమ్మేశాం

'ప్రీ లాంఛ్ కిందనే మేం 900 ప్లాట్లు అమ్మేశాం. విల్లా ప్లాట్లు కూడా 600 దాకా అమ్మాం. ఇప్పటికే 30 శాతం ప్లాట్లు సేల్ అయ్యాయి. రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే రిజిస్ట్రేషన్ చేయిస్తాం.. మా వెంచర్లకు పెద్ద సంస్థలతో టై అప్ ఉంది. మాది ట్రస్టెడ్ కంపెనీ. నవంబరులో అనుమతులు వచ్చేస్తాయ్' అని సంస్థ సేల్స్ జీఎం సూర్య చెప్పారు. అయితే అనుమతులు లేకుండా ప్రీ లాంఛ్ పేరిట అమ్మడం కుదరదని అధికారులు చెబుతున్నారు కదా అని అడిగితే కాస్త సీరియస్ అయ్యారు. 'మా ఆఫీసుకి వస్తే అన్నీ మా ఎండీ చెబుతారు. రాష్ట్రంలో 100 మంది అమ్ముతున్నారు. అందులో మేం ఒకరం. అయితే మేం కస్టమర్ల దగ్గర 100 శాతం పేమెంట్ తీసుకుంటున్నామా? మీకు నచ్చితే తీసుకోండి. ఇరిగేషన్ ఎన్వోసీ వస్తే అన్ని అనుమతులు వచ్చేస్తాయ్.. ఎవరైనా అమ్మొద్దనే అధికారులు ఉంటే మా ఎండీ దగ్గరికి పట్టుకురండి.. ఆయనే అన్నింటికీ సమాధానం చెబుతారు' అని పేర్కొన్నారు.. మేం కస్టమర్లను ఏం మోసం చేయడం లేదని చెప్పడం గమనార్హం.

ఆకర్షణీయమైన ఆఫర్లు

10 గుంటలు (ఒక విల్లా)= రూ.20 లక్షలు.

20 గుంటలు (రెండు విల్లాలు)= రూ.40 లక్షలు

30 గుంటలు (మూడు విల్లాలు)= రూ.60 లక్షలు

40 గుంటలు (నాలుగు విల్లాలు)= రూ.80 లక్షలు

– 266.66 చ.గ.ల స్థలంలో 900 చ.అ. విస్తీర్ణంతో విల్లాను 24 నెలల్లోనే హ్యాండోవర్.

బుక్ చేస్తే చాలు.. 10 గుంటలకు రూ.25 వేల విలువైన బంగారం మీ సొంతం.

– ఔటర్ రింగ్ రోడ్డుకు 30 నుంచి 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. 10 నిమిషాల్లో రీజినల్ రింగ్ రోడ్డు వస్తుంది. దగ్గరలో పెప్సీ, తోషిబా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఓక్సెన్, గీతం యూనివర్సిటీలు, ఐఐటీ హైదరాబాద్ కూడా దగ్గరే. దీపావళి బొనాంజ కింద ఎకరం రూ.75 లక్షలకే అమ్మేస్తున్నామని ఏజెంట్లు మార్కెట్లో ప్రచారం చేస్తున్నారు. బై బ్యాక్ ఆప్షన్ కూడా ఉంది. 18 నెలల్లో 50 శాతం రిటర్న్, 30 నెలల్లో 100 శాతం రిటర్న్ చేసే ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్ మొదటి 200 బుకింగ్స్ కి మాత్రమే అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.



Next Story