సమావేశ హాలులోకి దూసుకొచ్చిన మహిళా కౌన్సిలర్ల భర్తలు.. కుర్చీలు విసిరేసిన కుమారులు

by Dishanational1 |
సమావేశ హాలులోకి దూసుకొచ్చిన మహిళా కౌన్సిలర్ల భర్తలు.. కుర్చీలు విసిరేసిన కుమారులు
X

దిశ, అందోల్: అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం రసాభసాగా సాగింది. గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజెండా అంశాలను సభ్యులకు చదివి వినిపిస్తుండగా, ఎలాంటి చర్చ జరగకుండా ఆమోదిస్తున్నట్లు వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ చెప్పడంతో కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు. చర్చ జరగకుండా ఎలా ఆమోదిస్తారంటూ కాంగ్రెస్‌ కౌన్సిలర్లు పట్టుబట్టడంతో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. వినాయక నిమజ్జనం కోసం చెరువు వద్ద ఏర్పాట్లకు సంబంధించి రూ. 2 లక్షలు ఆమోదానికి పెట్టడంతో సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చెరువు వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదంటూ, తమ వద్ద ఫొటోలతో కూడిన ఆధారాలున్నాయని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు రంగ సురేష్, హరికృష్ణ గౌడ్, రేఖా ప్రవీణ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలపై తమని సంప్రదించకుండా, ఎజెండా అంశాలను ఏ ప్రాతిపదికన తయారు చేశారంటూ చైర్మన్‌ మల్లయ్య, కమిషనర్‌ అశ్రిత్‌ కుమార్‌లపై టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బతుకమ్మ పండుగకు రూ.2 లక్షలు, దసరా ఏర్పాట్లకు రూ.2 లక్షలు అంచనా వ్యయంపై కూడా సభ్యులు అభ్యంతరం తెలిపారు. పట్టణ ప్రగతి మొదటి విడతలో తాను చేపట్టిన మినీ వాటర్‌ ట్యాంక్‌ బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని, అధికార పార్టీలో ఉన్నా ఏం లాభమని 14వ వార్డు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ దుర్గేష్‌ ఆరోపించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఎన్నిసార్లు తీర్మాణాలు చేసినా, పనులు జరగడంలేదని, మూడేళ్లుగా ఎలాంటి పనులు చేయకుండా వార్డులో మొఖం చూపట్టలేకపోతున్నామని టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ సుమిత్ర సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్‌ ఫండ్‌ రూ.70 లక్షల వరకు ఉండడంతో ప్రతి వార్డుకు రూ.2 లక్షలను కేటాయించాలని సభ్యులు కోరడంతో సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. సమావేశం జరుగుతున్నంతసేపు కమిషనర్‌ మౌనముద్రను ప్రదర్శించారు. బుధవారం చైర్మన్, కమిషనర్‌ల మధ్య తీవ్రస్థాయి వాగ్వివాదం జరగడంతోనే సమావేశంలో వారిరువురూ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. చైర్మన్‌ కూడా కార్యాలయ మేనేజర్‌ పేరునే పలుసార్లు ప్రస్తావించారు.

పనులు చేస్తే బిల్లులు ఆపుతారా?

మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పదేపదే చెబుతున్నా అధికార పార్టీ నాయకులు, చేపట్టిన పనులకు బిల్లులను ఉద్దేశపూర్వకంగా బిల్లులను నిలుపుదల చేయించారని, ఇదేనా అభివృద్ది అంటే అని కాంగ్రెస్‌ వార్డు సభ్యుడు ఎ. చిట్టిబాబు ప్రశ్నించారు. బిల్లులు ఆపిన విషయమై చిట్టిబాబు, చైర్మన్‌ మల్లయ్యకు మధ్య వాగ్వివాదం జరిగింది. తన వార్డులో సుమారుగా రూ.30 నుంచి 40 లక్షల వరకు పనులు చేసినా, ఇప్పటివరకు ఎంబీ రికార్డు ఎందుకు చేయలేదో చెప్పాలని, బిల్లుల రికార్డు చేయకుండా ఎవరు ఆపుతున్నారో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు. రాజకీయాలు చేద్దామంటే రాజీనామా చేద్దామని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, ప్రజల మద్దతు ఎవరికి ఉందో తెలుస్తుందని చిట్టిబాబు సవాల్‌ విసిరారు.

సభలోకి చొచ్చుకొచ్చిన కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు

మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా కౌన్సిలర్‌ చిట్టిబాబు తన బిల్లులకు సంబంధించి ప్రస్తావించారు. ఈ క్రమంలో పక్క గదిలో ఉన్న అధికార పార్టీ కౌన్సిలర్ల భర్తలు, తనయులు సమావేశ హాలులోకి చొచ్చుకొచ్చారు. ఎజెండా అంశాలపై చర్చ జరగకుండా ఒక్కసారిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో సభలోకి వచ్చేందుకు మీకు ఎలాంటి హక్కు ఉందని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అడ్డుచెప్పారు. మహిళా కౌన్సిలర్‌కు చెందిన కుమారుడు కుర్చీని సభ జరుగుతున్న ప్రదేశంలోకి విసిరివేయడంతో ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. వారంతా లోనికి చొచ్చుకొచ్చినా అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడం శోచనీయం. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేశారు.


Next Story

Most Viewed