సిద్దిపేట, హుస్నాబాద్ కమలం సస్పెన్స్..?

by Naresh N |
సిద్దిపేట, హుస్నాబాద్ కమలం సస్పెన్స్..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట, హుస్నాబాద్ కమలం పార్టీ అభ్యర్థులెవరనే సస్పెన్స్ కొనసాగుతునే ఉంది. ఆరెండు అసెంబ్లీ స్థానాలకు మూడో జాబితాలో అభ్యర్థులను ప్రకటిస్తారని ఎదురు చూసిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లింది. గజ్వేల్, దుబ్బాక బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం..సిద్దిపేట, హుస్నాబాద్ అభ్యర్థులను పెండింగ్ లో పెట్టడంతో ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ నియోజక వర్గాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు. అయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సైతం ప్రారంభించారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో, దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారం ప్రారంభించగా, గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవడంతో పాటుగా, నియోజక వర్గంలో చేరికలపై దృష్టి సారించారు.

ఏదో ఒక స్థానంలో జనసేన పోటీ..?

భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో సిద్దిపేట లేదా హుస్నాబాద్ నియోజక వర్గంలో బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. గురువారం బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో సిద్దిపేట, హుస్నాబాద్ స్థానాలను పెండింగ్ పెట్టడంతో ఆ ఊహాగానాలకు ఉతాం ఇచ్చినట్లైంది. ఇదిలా ఉంటే..హుస్నాబాద్, సిద్దిపేట ఎమ్మెల్యే టికెట్లు తమ వర్గం నేతలకు ఇప్పించుకోవాలని ఈటెల.రాజేందర్, బండి. సంజయ్ పట్టు పడుతుండటం మరో కారణంగా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

ఆశావాహుల్లో ఉత్కంఠ...

సిద్దిపేట అసెంబ్లీ బీజేపీ టికెట్ కోసం 21 మంది, హుస్నాబాద్ అసెంబ్లీ బీజేపీ టికెట్ కోసం 8 మంది దరఖాస్తు చేసుకున్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో ప్రధానంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది. శ్రీకాంత్ రెడ్డి, బైరి. శంకర్ ముదిరాజ్, నాయిని. నరోత్తంరెడ్డి, చొప్పదండి. విద్యాసాగర్, కొత్తపల్లి. వేణుగోపాల్ లు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హుస్నాబాద్ నియోజక వర్గంలో బొమ్మ. శ్రీరాం చక్రవర్తి, జన్నపు రెడ్డి. సురేందర్ రెడ్డి, మంజుల రెడ్డి లు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుండటం, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ప్రచారం ప్రారంభించిన నేపథ్యంలో ఆయా నియోజక వర్గాల్లో బరిలో నిలవాలని చూస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. సిద్దిపేట, హుస్నాబాద్ బరిలో నిలిచేదవరనేదీ తెలియలంటే..కమల నాథుల నాలుగో జాబితా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిదే.

Next Story