లిక్కర్ స్కామ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

by Naresh N |
లిక్కర్ స్కామ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: లిక్కర్ స్కామ్ విషయంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో లంచం తీసుకున్న మనీష్ సిసోడియా జైలులో ఉంటే.. వంద కోట్లు లంచం ఇచ్చి వెయ్యి కోట్లు లాభాలు పొందడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత బయట ఎట్లుందని సూటిగా ప్రశ్నించారు. బుధవారం బీఎస్పీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహుజన దండయాత్ర సభలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పాటైన తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్యాక ప్రజలను ప్రగతి భవన్ కు, కనీసం ఫాం హౌస్ కు కూడా రానీయడం లేదన్నారు. ఫాంహౌస్ ల్లో నీలి జెండాలు నాటి పంచుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట సీఎం కేసీఆర్ రూ.80వేల కోట్ల రాష్ట్ర సంపదను ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఓటమి భయంతో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీకి సిద్దమైన అక్కడ ఓటమి తప్పదని జోస్యం పలికారు.


సీఎం కేసీఆర్ ఎన్ని బంధులు తీసుకొచ్చినా ప్రజలు బీఆర్ఎస్ దుకాణం బంద్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని బీరాలు పలికిన సీఎం కేసీఆర్ వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 80వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అసెంబ్లీ సాక్షిగా 13 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పిన సీఎం కేసీఆర్ చెప్పి కేవలం 5 వేల పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమన్నారు. బహుజన నాయకుడు వడ్డె జానయ్య అసెంబ్లీ ఎన్నికలల్లో పోటీ చేస్తాడనే భయంతో స్థానిక మంత్రి సూచనతో 71 కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. తొలుత సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఎస్పీలో చేరారు. సమావేశంలో బీఎస్పీ పార్టీ చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, అధికార ప్రతినిధులు జక్కని సంజయ్, రాష్ట్ర నాయకులు జక్కుల వెంకన్న, నియోజక వర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story