ఆక్రమణలపై మున్సిపల్ కొరడా.. ఆక్రమణల తొలగింపు

by Disha Web Desk 12 |
ఆక్రమణలపై మున్సిపల్ కొరడా.. ఆక్రమణల తొలగింపు
X

దిశ, జహీరాబాద్: ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపించారు. రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న దుకాణాలు ఇతర వ్యాపార సంస్థలు అక్రమణాలను తొలగించారు. నేతల అండదండలతోనే రహదారులపై ఇలాంటి దండాలు సాగుతున్నాయని ఆరోపణలున్నాయి. అక్రమణల తొలగింపుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులు అడ్డు తగలడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై ఆక్రమణల వలన ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. పర్యావసానంగా తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను దృష్టిలో ఉంచుకొని పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానికుల విజ్ఞప్తి మేరకు అధికారుల స్పందించారు.

జెసిబి , ట్రాక్టర్, మున్సిపల్ సిబ్బంది సహకారం తో మున్సిపల్ కమిషనర్ జి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి ఆక్రమణల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా మున్సిపల్ అధికారులు చేస్తున్న పనులకు కొందరు అవినీతిపరులైన ప్రజాప్రతినిధులు అడ్డు తగిలి ఆక్రమణలకు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పర్యావసానంగా ప్రతి సంవత్సరం ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టడం, తిరిగి వారంలోపే ఆక్రమణలు యధావిధిగా వెలుస్తున్నాయి. సర్వ సాధారణంగా మారిన ఇలాంటి కార్యక్రమాలతో ఎవరికి మేలు జరుగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తొలగించడం, ఏర్పాటు చేసుకోవడం లాంటి సందర్భాలు మున్సిపాలిటీలో దశాబ్దాల కాలంగా సాగుతోంది. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ఆక్రమణలు ప్రోత్సహిస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక సామాజికవేత్తలు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఒక వ్యాపార సంస్థ ముందు ఏర్పాటు చేసుకున్న తోపుడుబండ్లు, ఇతర చిల్లర, మల్లర వ్యాపారస్తుల వద్ద రోజుకు రూ.500 నుంచి 2000 వరకు వసూలు చేస్తున్న సందర్భాలు ఇక్కడ మామూలైపోయింది. ఇలా వసూలు చేస్తున్న వారిలో అధికార పార్టీ చెందిన నేతలు కూడా ఉన్నారు. అందువల్లే ఆక్రమణలు శాశ్వతంగా తొలగిపోవడం లేదు. దీంతో ఎదురవుతున్న సమస్యలు వస్తున్న ఆరోపణలతో మున్సిపల్ అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికైనా ఆక్రమణలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఇటు అధికారులు , అటు ప్రజాప్రతినిధుల పైన ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఆక్రమణలను ప్రోత్సహించి, డబ్బులు వసూలు చేసుకోవడం మానాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



Next Story

Most Viewed