భూముల క్రమబద్దీకరణ 30 వరకు చేసుకోవాలి: వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి తలసాని

by Disha Web Desk 1 |
భూముల క్రమబద్దీకరణ 30 వరకు చేసుకోవాలి: వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి తలసాని
X

దిశ, సంగారెడ్డి: జీవో నెం.58 సంబంధించి పెండింగ్ పట్టాల పంపిణీ వారం రోజుల్లో పూర్తి చేయాలని, జీవో నెం.59 కు సంబంధించి క్రమబద్దీకరణ రుసుము వసూలుపై ప్రత్యేక శ్రద్ధ వహించి పట్టాలు పంపిణీ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా హైదరాబాద్ నుంచి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలెక్టర్ శరత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రెండో విడత గొర్రెల పంపిణీ, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు, జీవోనెం.58, 59, 76, 118 క్రమబద్దీకరణ పై సమీక్షించారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ జీవో నెం.58,59 కింద దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించామని, కటాఫ్ తేదీ 2020 జూన్ 02 వరకు పొడగించినట్లు ఆమె తెలిపారు. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉందన్నారు. తిరస్కరణ కు గురైన దరఖాస్తులు మరోసారి రివ్యూ చేసి నూతన నిబంధనల ప్రకారం అర్హత సాధించే వారికి సమాచారం అందించాలని తెలిపారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గ్రామాల్లో సంపద పెంచే దిశగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం రెండో విడత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు 7,28,877 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 60,553 మందికి రీడింగ్ కళ్లజోళ్లు, 28,976 మందికి ప్రిస్క్రిప్షన్ కళ్లజోళ్లు అందజేసామని తెలిపారు.

జిల్లాలో నాలుగు ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 694 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీ దేవి, జిల్లా పశు సంవర్ధక శాఖ డీడీ వసంత కుమారి, సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed