స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు : తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం

by Disha Web Desk 1 |
స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు : తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం
X

ఆస్తులు, పదవుల ఆర్జన కోసమే మంత్రుల ఆరాటం

దిశ‌, జహీరాబాద్ : స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ఆస్తులు, పదవుల ఆర్జన కోసమే మంత్రులు ఆరాట పడుతున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పని తీరు, మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగట్లేదన్నారు.

తెలంగాణ ప్రజల కోరుకున్నది ఏ ఒక్కటి జరగలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్తులు సంపాదించుకున్నారు కానీ, ప్రజలకు సేవ చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావం రోజు నిరసన తెలిపేందుకు కూడా చర్యలు తీసుకుంటామనడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్స్ బాధితుల పక్షాన, స్థానికులకు ఉద్యోగాల విషయంలో, చెరుకు రైతులు విషయంలో కానీ ఆర్టీసీ ఉద్యోగుల పోరాటంలో, నిమ్స్ భూ భాధితుల పోరాటంలో తమ పార్టీ వారికి మద్దతుగా నిలిచిందన్నారు. తప్పకుండా భావసారూప్యత, కలిసొచ్చే వారితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు.

జహీరాబాద్ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా పోటీ చేస్తామన్నారు. పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేసినందున ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో అధ్యక్షుడు మొగుడంపల్లి ఆశప్ప ఆధ్వర్యంలో సుధీరకాలంగా సుమారు పది సంవత్సరాలుగా ప్రజలు, రైతులు, బాధితుల పక్షాన పోరాటాలు చేస్తున్నారని తెలిపారు.స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి అడ్డాగా, చిరునామాగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బాధితుల్లో భరోసా కల్పించేందుకు ఈ కార్యాలయం వారిలో ధైర్యాన్ని నింపుతుందన్నారు.

రాష్ట్రంలో 24 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ దిశగా చర్చలు జరుపుతున్న మని తెలపారు. నాలుగైదు స్థానాల్లో బలంగా ఉన్నామని వాటిలో జహీరాబాద్ ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రావుల లక్ష్మి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రైతు విభాగం కన్వీనర్ మార్గం శ్రీధర్, మండలాధ్యక్షులు తుల్జా రెడ్డి, గోపాల్ రెడ్డి, అలీమ్, మల్లికార్జున్, లక్ష్మణ్, ప్రేమ్ కుమార్, రైతు ఉద్యమ నాయకుడు నరసింహారెడ్డి, నిమ్స్ రైతు పోరాట కన్వీనర్ రాజిరెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి, బుచ్చిరెడ్డి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story