మరోసారి హల్దీవాగులోకి గోదావరి జలాలు విడుదల

by Disha Web Desk 15 |
మరోసారి హల్దీవాగులోకి గోదావరి జలాలు విడుదల
X

దిశ, వర్గల్‌ : మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయం సమీపంలో కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కెనాల్‌ ద్వారా హల్దీవాగుకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్ రెడ్డి కలిసి గోదావరి జలాలను విడుదల చేశారు. గోదావరి జలాలకు పసుపు, కుంకుమ, పుష్పాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానంలో ఇది మరో అపూర్వ ఘట్టమని, రాష్ట్రంలో బీడు భూములను మాగాణులుగా మారనున్నాయని అన్నారు. నీరు పళ్లమెరుగు అనే సామెత మనందరికీ తెలిసిందేనని కానీ అందుకు విరుద్ధంగా 30 తాటిచెట్ల ఎత్తుకు గోదావరి జలాలను తీసుకొచ్చారని, నదికి నడక నేర్పిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. చరిత్రను తిరగ రాసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని ఆయన స్పష్టం చేశారు. ఫలితంగా రాష్ట్రంలో బోరుబండ్లకు జాడ లేకుండా పోయిందని, చెరువులు పుష్కలంగా జలాలతో నిండి ముదిరాజులు, గంగపుత్రులు మంచిగా బతుకుతున్నారని తెలిపారు. తెలంగాణ విధాత, అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతాంగానికి సాగునీటి కొరతను తీర్చారన్నారు. నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో జరగనున్న బ్రహ్మోత్సవాల దృష్ట్యా ముందస్తుగా హల్దీవాగులోకి నీళ్లను విడుదల చేశామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్మన్‌ రోజాశర్మ, జెడ్పీటీసీ బాలు యాదవ్‌, ఎంపీపీ జాలిగామ లత రమేశ్‌గౌడ్‌, ప్యాక్స్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, సర్పంచులు గోపాల్ రెడ్డి, కరుణాకర్, సంతోషవెంకటేశ్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.


Next Story