ఎమ్మెల్యే పద్మా రెడ్డి.. మీకు దమ్ముంటే తండాలకు రండి : మైనం పల్లి

by Naresh N |
ఎమ్మెల్యే పద్మా రెడ్డి.. మీకు దమ్ముంటే తండాలకు రండి : మైనం పల్లి
X

దిశ, పాపన్నపేట: మీకు దమ్ముంటే.. మండలంలోని ఓ నాలుగు తండాలకు వెళ్లి కూర్చుందాం.. ఎవరు ఏమి అభివృద్ధి చేశారో తేల్చుకుందాం.. అంటూ మెదక్ ఎమ్మెల్యే పద్మా రెడ్డికి మెదక్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ సవాలు విసిరారు. గురువారం మండల పరిధి పొడ్చన్ పల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నాయకులు, యువకులు, ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ కార్యకర్తలతో గ్రామం దద్దరిల్లింది. ప్రచారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. ఊ.. అంటే డబ్బుల సంచులు అని తీయడం సిగ్గుచేటన్నారు. మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మెదక్ నుంచి తరలిపోతున్న ఆఫీసులు, జింకలు, డిగ్రీ కళాశాల గురించి మాట్లాడండని సవాలు విసిరారు. అవి పక్కన పెట్టి మాపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. పోచారం నుంచి సిద్దిపేటకు జింకలు తరలిస్తే ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. పద్మా దేవేందర్ రెడ్డి గ్రామాల్లోకి వస్తే బతుకమ్మ ఆడడం, లేదా ఏడవడం తప్ప.. అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. నాపై ఎంత తక్కువగా దృష్టి పెడితే నీకు అంత మంచిదని రోహిత్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఓ కార్యకర్త గత కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరితే నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇలా డబ్బు, పదవులు ఆశ చూపి కాంగ్రెస్ కార్యకర్తలను కొనుగోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమవుతోందనే భయంతో ఇలా ఇతర పార్టీల నాయకులను మభ్యపెడుతున్నారన్నారు. నా మీద ఆరోపణలు చేసుడు మానేసుకుని.. నియోజకవర్గాన్ని మీరు ఏం అభివృద్ధి చేశారో గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాలని స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని సూచించారు. చేసిన అభివృద్ధి చెప్పుకోలేకనే మాపై ఆరోపణలతో చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల ద్వారా ముందుకు సాగుతుంటే.. మీరు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారన్నారు. 18 సంవత్సరాలకు ఓటు వేసే హక్కు.. 25 సంవత్సరాలకు ఎన్నికల్లో నిలబడే హక్కు మనకు రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించని మీరు ప్రజలను ఏం గౌరవిస్తారని విమర్శించారు.

గతంలో పీకే మహంత అనే యువకుడు యూనివర్సిటీ నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆరోగ్యం సహకరించకున్న మిమ్మల్ని కలవాలనే వచ్చానని.. మీతో ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నానని.. నన్ను క్షమించాలంటూ కార్యకర్తలను వేడుకున్నారు. నాకు ఓటు వేసి గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారెంటీలను పక్కా అమలు చేస్తామన్నారు. ఎంఎస్ఎస్ఓ తరపున వేసిన బోరు బావుల్లో అతి త్వరలో బోరు మోటారు పంపులు బిగిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడే బిగించాలనుంది కానీ.. అధికార పార్టీ నాయకులు అడ్డు పడుతున్నారన్నారు. వీరు చేయరు.. చేసే వాళ్లను చేయనీయరు అంటూ విమర్శించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిలా ముందు ఉంటానని పేర్కొన్నారు. ఎంఎస్ఎస్ఓ పేరున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలోనే 400 వరకు బోరుబావులు తవ్వించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజల్లో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని గిమ్మిక్కులు వేసినా వారి ఓటమి ఖాయమన్నారు. తెలంగాణ కోసం అమరులు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలు చేస్తే బీఆర్ఎస్ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత అభివృద్ధి అంశాలు మర్చిపోయారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, నియామకాలు, నిధులు అంటూ కోట్లు దండుకొని 10 సంవత్సరాల పాటు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ కు చెమటలు పడుతున్నాయన్నారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, పార్టీ మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, పాపన్నపేట, కుర్తివాడ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్, రమేష్, నాయకులు వరుణ్ రెడ్డి, నరేందర్ గౌడ్, నాగ్సన్పల్లి భరత్ గౌడ్, జీవన్ రావు తదితరులతో పాటు యువకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.





Next Story

Most Viewed