అంగన్వాడిల డిమాండ్ లు న్యాయపరమైనవే.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

by Disha Web Desk 20 |
అంగన్వాడిల డిమాండ్ లు న్యాయపరమైనవే.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి
X

దిశ, సదాశివపేట : అంగన్వాడి సమ్మె పై ప్రభుత్వం స్పందించాలని, అంగన్వాడీ టీచర్లను, ఆయాలను పర్మనెంట్ చేయాలని, 26వేల జీతం ఇస్తూ అన్ని బెనిఫిట్స్ అమలు చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వారి డిమాండ్ లు న్యాయపరమైనవే అని అన్నారు. మంగళవారం సదాశివాపేటలో అంగన్వాడిల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఉన్నారని, గత 15 రోజుల నుండి ఉద్యోగులు సమ్మెచేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఎన్నికల కోడ్ వచ్చేలోపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎన్నికల తర్వాత డిమాండ్ లు నెరవేరుస్తామని ప్రభుత్వం చెప్తే మీరు ఆలోచన చేయాలని వారికి సూచించారు. ఇప్పుడు ప్రభుత్వం చేయకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ డిమాండ్ లు నెరవేరుస్తామన్నారు.

కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇచ్చి ఓట్లు వేస్తే... నేను ఎమ్యేల్యేగా వుండి ముఖ్యమంత్రి ఎవరున్నా సరే మీ డిమాండ్ లు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. తాను వారం రోజులో ఢిల్లీకి వెళ్తున్నానని. రాహుల్ గాంధీకి అంగన్వాడీల సమస్య వినిపిస్తా అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి డిమాండ్ లకు మద్దతు పలుకుతామన్నారు. కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని, పెన్షన్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ10 లక్షలు, హెల్పర్లకు రూ 5 లక్షలు చెల్లించాలన్నారు. వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని కోరారు. 60 సంవత్సరాల దాటిన అంగన్వాడీ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే బెనిఫిట్స్ కల్పించాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం 5లక్షలు చెల్లించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీలకు ఎప్పుడు సంపూర్ణ మద్దతుగా ఉంటుందన్నారు. వీరితో పాటు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ, కంది కృష్ణ, రామి రెడ్డి, సీపీఎం నాయకులు ప్రవీణ్, తదితరులు ఉన్నారు.

Next Story