- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య మౌలిక వసతులు కల్పించాలి: మంత్రి దామోదర రాజనర్సింహ
జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

దిశ, సంగారెడ్డి: జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర కార్మిక, ఎంప్లాయిమెంట్ శాఖ మరియు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. తాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, రవాణా, ఆర్ అండ్ బి, పిసిబి, పి ఆర్, విద్యుత్, డి ఆర్ డి ఏ, సంక్షేమ శాఖలు, ఆర్టీసీ, షుగర్ కేన్, పరిశ్రమలు, తదితర రంగాల పురోగతిపై మంగళవారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, ఇండస్ట్రియల్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి జిల్లా మరింత పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులను క్రాప్ డైవర్షన్ వైపు ప్రోత్సహిస్తూ, లాభదాయక పంట అయిన ఆయిల్ పామ్ సాగుపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
గూడు లేని పేదలకు..
వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని, రైతులకు యూరియా, డీఏపీ తదితర ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సరైన సాంకేతిక మార్గదర్శకత్వం అందించి ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని, గూడు లేని పేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో గతంలో నిర్మించి కేటాయించని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని, తాగునీటి సమస్యలు ఎక్కడా తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రయోజనాలు వారికి అందేలా చూడాలి..
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల మేరకు నీటి నిల్వలను నిర్వహించాలని చెప్పారు. జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి అవసరమైన మౌలిక వసతులపై నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు అందజేయాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. జాతీయ రహదారి–65 పరిధిలో ఉన్న విద్యుత్ స్తంభాల మార్పిడి పనులను వేగవంతం చేయాలని, నిర్మాణ కార్మికుల నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి అందేలా చూడాలని సూచించారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించే దిశగా కార్యాచరణ రూపొందించాలని, అవసరమైన అదనపు బస్సుల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. హాస్పిటళ్లు, హోటళ్లు తదితర సంస్థల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించి కాలుష్య నియంత్రణ చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వం చేస్తున్న సేవలు ప్రజలకు ప్రత్యక్షంగా చేరాలి..
ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలు ప్రత్యక్షంగా చేరడం ముఖ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన బోర్‌వెల్స్ కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని డయాగ్నస్టిక్ పరికరాలు, డ్రగ్స్, అవసరమైన ఇక్యుమెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, డయాలసిస్ సేవలకు అవసరమైన చోట అదనపు పడకల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నర్సింగ్ కళాశాలను ఈ నెలాఖరులోగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. నర్సింగ్ వృత్తికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉన్నందున గ్రామీణ ప్రాంతాల యువతులను నర్సింగ్ కోర్సులు అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి 35 కిలోమీటర్ల పరిధిలో ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో...
అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన డ్రైవర్ల నియామకాల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరంలోపు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీలు , ఎమ్మెల్సీ, శాసనసభ్యులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ సురేష్ శేఖర్ రైతు సమస్యలను పార్టీలకతీతంగా పరిష్కరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతులకు న్యాయం చేయాలన్నారు. ఎంపీ రఘునందన్ రావు ప్రజలు మోసపోకుండా ఏ సర్వే నంబర్లు ఏ భూమి ఉందో తెలిసేలా వెబ్సైట్లో పెట్టాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






