భూ కబ్జాలు... భూ దందాలతో కేసీఆర్ పాలన : దామోదర్ రాజనర్సింహ

by Disha Web Desk 15 |
భూ కబ్జాలు... భూ దందాలతో కేసీఆర్ పాలన : దామోదర్ రాజనర్సింహ
X

దిశ, చౌటకూర్ : రాష్ట్రంలో భూకబ్జాలు భూదందాలు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ విమర్శించారు. సోమవారం చౌటకూరు మండలంలోని శివంపేట, ఉమ్మడి పుల్కల్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో దొరల పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు అయిందని, మిగతా ప్రజలకు ఎలాంటి లాభం జరుగలేదని ఆరోపించారు.

అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలనలోనే అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందన్నారు. అప్పట్లో చేపట్టిన పనులే ఇప్పటికి కనిపిస్తున్నాయన్నారు. సింగూర్ జిల్లాల కోసం 102 రోజులపాటు దీక్షను చేపట్టి 40 వేల ఎకరాలకు సాగుకు నీటిని అందించిన ఘనత తమకే దక్కుతుందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు. ఏక కాలంలో రైతు రుణమాఫీ, ఉచిత కరెంట్ ను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రం, రాష్టంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నత్తి దశరథ్, దుర్గారెడ్డి, మాజీ మండల అధ్యకులు సుభాష్ రెడ్డి, రాం చెంద్ర రెడ్డి, గ్రామ సర్పంచ్ లు పల్లవి, రాజిరెడ్డి, ఎంపీటీసీ కిరణ్ గౌడ్, నాయకులు లక్ష్మారెడ్డి బాలా గౌడ్, దుర్గయ్య, అంజయ్య పాల్గొన్నారు.


Next Story