మంత్రి బంధువుల కోసమే ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్పు : కోదండరాం

by Disha Web Desk 13 |
మంత్రి బంధువుల కోసమే ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్పు : కోదండరాం
X

దిశ, సంగారెడ్డి: మంత్రి బంధువుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ మార్చుతూ.. పేదల భూముల నుంచి ప్లాన్ మార్చారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. బుదవారం కొండాపూర్ మండల పరిదిలోని గిర్మాపూర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ బాధిత రైతులతో సమావేశమాయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చిన్న రైతులకు ఒకటి, అర ఎకరం చొప్పున భూములు ఉంటాయని, ఆ భూమిని ప్రభుత్వం తీసుకుంటే వారు ఎలా జీవిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం భూముల విలువ కోట్లలో ఉన్న నేపథ్యంలో వారి బతుకుదెరువుకు, ఆత్మ గౌరవానికి భూమి ఒక్కటే ఉందన్నారు. రైతులు తమకు ఉన్న పొలంలో నర్సరీలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారని, అలాంటి భూమిని రాష్ట్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల నుండి అతి తక్కువ ధరలతో ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం లాక్కోవడం సబబు కాదన్నారు. గతంలో ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఏ విధమైన అలాన్‌మెంట్‌ చేసిందో అదే మాదిరిగా అలాన్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

గతంలో చేసిన అలాన్‌మెంట్‌ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమీప బంధువు భూములు ఉన్న నేపథ్యంలో వారి భూములను కాపాడేందుకు అలాన్‌మెంట్‌ మార్చడం చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కేవలం రైతు బంధు, రైతు భీమాలు కాదు కావాల్సింది, వారి భూమిని కాపాడితే చాలని ప్రభుత్వానికి సూచించారు.

ఒక వేళ ప్రభుత్వం అనివార్యమై భూములను తీసుకోవాల్సి వస్తే.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. రైతులకు పరిహారం ఇచ్చి భూములను తీసుకోవాలి. కానీ, ఇష్టానుసారంగా తీసుకుంటే ప్రభుత్వంపై ఆర్‌ఆర్‌ఆర్‌ భాధిత రైతుల తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలోనే సంగారెడ్డికి సమీపంలో చాలా రహదారులు ఉన్నాయని, మళ్ళీ కొత్త రహదారులు కూడా అవసరం లేదన్నారు. ఈ రహాదారుల వలన ప్రతి సారి చిన్న, సన్న కారు రైతులే తమ భూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కొంత మంది మెప్పు కోసం అలాన్‌మెంట్‌ మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రీజినల్‌ రింగ్‌ రోడ్డు బాదితులకు న్యాయం చేసేంతవరకు ప్రభుత్వం పై పోరాడుతామని హామీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి, బాధిత రైతులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed