జనవరి 18 నుండి 2వ విడత కంటి వెలుగు: మంత్రి హరీష్

by Disha Web Desk 19 |
జనవరి 18 నుండి 2వ విడత కంటి వెలుగు: మంత్రి హరీష్
X

దిశ , సంగారెడ్డి: జనవరి 18వ తేదీ నుంచి రెండవ విడత కంటి వెలుగు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు జిల్లాల కలెక్టర్లకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, వైద్య, పంచాయతీ రాజ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండవ విడత కంటి వెలుగు 2023 జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించుటకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

జిల్లాలో గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా కంటి వెలుగు శిబిరాల షెడ్యూల్‌ను పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లు, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ప్రతి టీమ్‌లో ఒక డాక్టర్ అప్తోమెట్రిస్ట్, ఆశాలు, ఏఎన్ఎంలు, డాటా ఎంట్రీ ఆపరేటర్, సీహెచ్ఓలు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు శిబిరాలు ప్రారంభించాలన్నారు. పరీక్షల అనంతరం రీడింగ్ కళ్ళద్దాలు అదే రోజు, డిస్టెన్స్ స్పెసిఫిక్ కళ్ళద్దాలు 15 రోజుల్లో సంబంధిత ప్రజలకు అందజేస్తామని మంత్రి తెలిపారు.

జిల్లాలో ఆఫ్తామాలజిస్టుల నియామకాలను త్వరగా పూర్తి చేసి, జాబితా అందజేస్తే సరోజినీ కంటి ఆసుపత్రి, ఎల్వీ ప్రసాద్ ల్యాబ్‌లో శిక్షణ అందజేయడం జరుగుతుందని, వైద్య బృందాలకు అవసరమైన డాటా ఎంట్రీ ఆపరేటర్ నియామకం సైతం చేపట్టి, వారికి జిల్లా స్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో నూతనంగా 959 డాక్టర్ల నియామకం వారంలోగా పూర్తవుతుందని, అదనంగా ఆర్.బి.ఎస్.కె వైద్యులను, ఆయూష్ వైద్యులను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా స్థాయిలో షెడ్యూల్, మైక్రో ప్లానింగ్ పూర్తి చేసిన తరువాత, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా మంత్రి అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో 17,11,678 మంది జనాభాకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు మొత్తం 69 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 647 గ్రామ పంచాయతీలు,199 మున్సిపల్ వార్డులు,7జీహెచ్‌ఎంసీ ఏరియాలు ఉన్నాయని తెలిపారు. రూరల్‌లో 41, అర్బన్‌లో16, జీహెచ్‌ఎంసీ పరిధిలో 6, బఫర్‌గా 6 టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ జిల్లా నుండి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ గాయత్రి దేవి, డా.శశాంక్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, మున్సిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed