- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ధరణి ఆపరేటర్ కాదు.. రియల్టర్ల ఆపరేటర్..
రెవెన్యూలో సర్కారు సంస్కరణలు తెచ్చినా.. అవినీతి చీడ మాత్రం తొలగడం లేదు.. ఇటీవల అవినీతి ఆర్ ఐ ఏసీబీ అధికారులకు చిక్కి నెల రోజులు గడవక ముందే అదే శాఖ లో ధరణి ఆపరేటర్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఆపరేటర్ ఒక్కడే చేశాడా.. ఇతర రెవెన్యూ అధికారాలకు వాటాలు ఉన్నాయా? అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే వేణు రెడ్డి బాగోతం అంతా ఇంతా కాదు.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన ఇతను ధరణి పోర్టల్ పై మంచి పట్టు ఉంది. దీంతో వసూళ్లకు తెరలేపాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన వేణు రెడ్డి ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీగా ఆస్తులు సంపాదించినట్లు స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. తహశీల్దార్ కంటే ఇతనిని సంప్రదిస్తేనే పని అవుతుందని ప్రజలు భావించడాన్ని చూస్తే ఇతడి ప్రభావం రెవెన్యూ శాఖలో ఏ మేరకు ఉందో తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రజలను పీడిస్తూ లంచావతారులుగా మారిన ఇలాంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ జిల్లా కౌడి పల్లి ధరణి ఆపరేటర్ వేణు రెడ్డి రైతు నీరుడి పోచయ్య అనే రైతు భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించి రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన విషయం తెలిసిందే.. కానీ వేణు రెడ్డి తీరుపై స్థానికంగా అనేక ఆరోపణలు ఉన్నాయి.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వేణు రెడ్డి కి ధరణి పోర్టల్ పై మంచి పట్టు ఉంది.
అందులోనే కౌడిపల్లి లో రెండు మూడేళ్లుగా రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో రియల్టర్లు ధరణి ఆపరేటర్‌నే పక్కాగా నమ్మడం మొదలు పెట్టారు. ముఖ్యంగా కౌడిపల్లి తహశీల్దార్‌లు తరచూ బదిలీ అవుతుండడం.. కొత్త వారు వస్తుండటం కూడా వేణు రెడ్డికి కలిసి వచ్చింది. దీంతో రెవెన్యూ కార్యాలయంతో అధికారిక తహశీల్దార్‌గా కొనసాగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన వేణు రెడ్డి ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ ఎత్తున ఆస్తులు కూడా బెట్టినట్లు స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి.
వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో ధరణిలో ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని రియల్ వ్యాపారులకు అనుకూలంగా రికార్డులు మార్చి అందులో పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రైతు నీరుడి పోచయ్య వద్ద కూడా ఇదే విధంగా పాచికలు వేసి బోల్తా పడడంతో ఆపరేటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి బాధితులు కౌడిపల్లి మండలంలో పదుల సంఖ్యలో ఉన్నారని స్థానికంగా ప్రచారం సాగుతోంది.
ఆపరేటర్ మూటలో అధికారుల వాటా ఎంత..?
ధరణి ఆపరేటర్ రైతును నేరుగా డబ్బులు డిమాండ్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ కీలకం. మరి కౌడిపల్లిలో మాత్రం ధరణి ఆపరేటర్ ఏసీబీకి చిక్కడం వెనక అందులో ఎవరి వాటా ఎంత ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎక్కడైనా కింది స్థాయి అధికారి డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా వెళ్లి తహశీల్దార్ కు ఫిర్యాదు చేస్తారు.. ఏదైనా చిన్న పని చేయకుంటే వెంటనే వెళ్లి సంబంధిత శాఖ పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు.
కానీ కౌడిపల్లి లో మాత్రం తహశీల్దార్ దృష్టికి డబ్బుల డిమాండ్ ఫిర్యాదు ఎందుకు వెళ్లలేదు.. వెళ్లినా అంతా ఆపరేటర్ చూసుకుంటాడని వదిలి వేశారా ? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఎవరు వెళ్లినా వేణు రెడ్డి ని కలిస్తే పని అయిపోతుందని చెప్పడంతో పాటు వచ్చే ప్రతి పైసలో పై స్థాయి అధికారుల వరకు వచ్చిన మామూళ్లు వెలుతాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆపరేటర్, అతనితో పాటు ఉన్న వ్యక్తి చిక్కడంతో వారిద్దరి పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇంకా లోతుగా విచారణ జిల్లా అధికారులు చేస్తే ఎవరి వాటా ఎంత? అన్నది తేలే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు.
జిల్లాలో ఆగని రెవెన్యూ ఆగడాలు..
రెవెన్యూ ఆగడాలు జిల్లాలో మితిమీరి పోతున్నాయనేదానికి ఇటీవల కాలంలో ఏసీబీకి చిక్కిన ఉదంతాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ నెల 6 న చిన్న శంకరం పేట ఆర్ ఐ శ్రీహరి, వీఆర్ఏ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన మరువక ముందే కౌడిపల్లి ధరణి ఆపరేటర్ వేణు రెడ్డి రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కడం రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఆరు మాసాలుగా రెవెన్యూ సంబంధించిన ఐదుగురు అధికారులు ఏసీబీకి చిక్కడం జిల్లాలో వారి పనితీరును చూపిస్తుంది.
కార్యాలయానికి వెళ్లే ప్రతి వారి వద్ద కొంతమంది అధికారులు జలగల్లా పీల్చుకు తినడంతో బాధితులు తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇన్ని దాడులు జరిగి జైలు పాలైన ఆ శాఖలో లంచావతారుల అవినీతి ఆగడాలు ఆగక పోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు అవినీతి రూపుమాపి పకడ్బందీ నిఘా పెడితే రెవెన్యూ శాఖపై వస్తున్న మచ్చ తొలగిపోయే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.