మెదక్ ప్రజలకు శుభవార్త

by Dishanational1 |
మెదక్ ప్రజలకు శుభవార్త
X

దిశ, మెదక్: రాబోయే కాలంలో మెదక్ మెడికల్ హబ్ గా మారుస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే నిజాంపేట జెడ్పీటీసీ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత సభల్లో పలు సమస్యలపై చర్చ జరుపుతున్నాని, అయినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.. ఈసారి గత సభలో చర్చించిన అంశాలపై ప్రస్తావించాలని కోరగా మంత్రి స్పందించి ఆ అంశం వచ్చినప్పుడు అడగాలని, గత సభలో సభ్యులు అడిగిన ప్రతి సమస్యలు ఎజెండాలో ఇవ్వడం జరిగిందన్నారు.

మెదక్ లో ర్యాక్ పాయింట్ వచ్చాక ఎరువులను అందించేందుకు స్టోరేజ్ పెరిగిందా అని మంత్రి వ్యవసాయ శాఖ అధికారి ఆశా రాణిని అడిగారు. రాబోయే కాలంలో ఎరువుల కొరత రాకుండా బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయిన తర్వాత పంటల సాగు భారీగా పెరిగిందని మంత్రి అన్నారు. 2015లో జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చేవి కావన్నారు.. కానీ ఇప్పుడు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందన్నారు. పంట సాగు పెరగడానికి ప్రభుత్వం నీటి లభ్యత, కరెంట్ అందించడమే కారణమన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా ఉండటం వల్ల మెదక్ జిల్లాలోనే ఐదు రెట్ల ధాన్యం పెరిగిందన్నారు. దక్షిణ భారత దేశ భాండాగారంగా తెలంగాణ రాష్త్రం మారిందని, ఇందుకు ఇటీవల పండిన పంటలే సాక్ష్యం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ముప్పై లక్షల సాగు చరిత్ర సృష్టించిందనీ తెలిపారు.

మన దేశంలోనే వరి అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఎరువుల కొరత రానివ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పంట సాగు, ఉత్పత్తి, రైతు ఆదాయం పెరిగి బెంగాల్, బీహార్ నుంచి వలస వచ్చి మన ప్రాంతంలో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారన్నారు. నూకలు, బియ్యం విదేశాలకు వెళ్లకుండా, 20 శాతం సెస్ వేసి కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ బోర్లకు కరెంట్ మీటర్ పెట్టకపోవడం వల్ల కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన రూ. 30 వేల కోట్లు నిలిపివేసిందన్నారు. ఎంత భారమైన రాష్ట్రంలో కరెంట్ మీటర్లు పెట్టేది లేదన్నారు.


వైద్యశాఖ అధికారులను అభినందించిన మంత్రి...

జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగడం పట్ల మంత్రి వైద్య అధికారులను అభినందించారు. జిల్లాకు ఎన్ని పల్లె దవాఖానాలు, ఎన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నారని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. పల్లె దవాఖానాలు- 57, బస్తీ దవాఖానాలు- 11 ఉన్నాయని, మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో అధికంగా ప్రసవాలు జరిగినట్లు అధికారులు చెప్పారు. దీని వల్ల ప్రైవేట్ ఆస్పత్రులు మూతపడే అవకాశం ఉందన్నారు. మెదక్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇటీవలే ఎంసీహెచ్ ప్రారంభించామని, క్రిటికల్ కేర్ కోసం రూ. 23 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలో మెడికల్ హబ్ గా మెదక్ కానుందని.. మెడికల్ కళాశాల, 40 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మందు లేదు, డాక్టర్ లేదు, నర్సు లేదు అనే అంశం ఎక్కడా రావొద్దు. రాష్ట్రంలో వెయ్యి వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని, జిల్లాలో డెలవరీల సంఖ్య పెరిగిందన్నారు. జిల్లాలో 150 సబ్ సెంటర్లు ఉన్నాయని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. దసరా వరకు పూర్తి చేస్తామన్నారు. ప్రతి పీహెచ్ సీలో మూడు నెలల మందులు స్టాక్ ఉండాలని, ఎక్కడా మందులు లేవు అంటే ఇంటికి పంపుడే ఉంటదన్నారు. అలాగే బీసీ మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. డబుల్ బెడ్రూంలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలనే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. నిజాంపేట్ పీహెచ్సీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశించారు. త్వరలో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మండలాల్లో అసౌకర్యాలు ఉన్నాయని చిలిపిచెడ్ ఎంపీపీ వినోద మంత్రికి చెప్పగా కొత్త మండలాలకు రూ. 5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మధన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జెడ్పీ సీఈఓ శైలేష్ కుమార్ లతోపాటు జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed