మిడతల దండుతో జాగ్రత్త.. బీజేపీ నేతలపై ఎర్రొళ్ల శ్రీనివాస్​ ఆగ్రహం

by Disha Web Desk 4 |
మిడతల దండుతో జాగ్రత్త.. బీజేపీ నేతలపై ఎర్రొళ్ల శ్రీనివాస్​ ఆగ్రహం
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: సదస్సుల పేరుతో బీజేపీ నేతలు హైదరాబాద్ ​మహానగరానికి మిడతల దండులా వచ్చి పడ్డారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్​ ఎర్రొళ్ల శ్రీనివాస్​ ఎద్దేవా చేశారు. సమావేశాలకు ఇంత హంగామా ఏం అవసరమని ఆయన బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. కూర్చుని మాట్లాడుకునే సమావేశాలు వేరుగా ఉంటాయని, వీరంతా ప్రశాంతంగా ఉన్న పట్నంలో పంచాయతీలు పెట్టడానికి వచ్చారంటూ నిప్పులు చెరిగారు. అయినా తెలంగాణను ఏం ఉద్దరించారని ఊపుకుంటూ వస్తున్నారు..? మీరిచ్చిందేమిటీ..? నగరంలో మీ సర్కస్​ ఫీట్లు ఏమిటని విమర్శించారు. మీ సర్కస్ ​ఫీట్లకు కాలం చెల్లిందని, ఉద్యమ నేత కేసీఆర్​ ఇలాకాలో మీ ఆటలు సాగబోవన్నారు. ఎలాగూ వచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, సంక్షేమ పథకాలు తీరును తెలుసుకుని పోవాలని ఎర్రొళ్ల సూచించారు. రాష్ట్ర సీఎం కేసీఆర్​తో సహా మంత్రులు, ఎంపీలు తెలంగాణ అభివృద్ధి విషయంలో పలు సందర్భాల్లో నిధులడిగితే మొండిచేయి చూపిన మీరు... ఇక్కడ ఏం ఉద్దరించినట్లు ఉరుకులాడుతున్నారని ప్రశ్నించారు. మా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు..? నిధుల పంపిణీలో తెలంగాణపై ఎందుకు చిన్నచూపు..? అని ప్రశ్నించారు.

వివిధ రాష్ట్రాల్లో ప్రజల ఆమోదంతో ఏర్పడిన ప్రభుత్వాలను పడగొడుతూ కుట్ర పూరితంగా తమ ఖాతాల్లో వేసుకుంటున్న మీరు ప్రజాస్వామిక వాదులు ఎలా అవుతారని ప్రశ్నించారు. బీజేపీ నీచ రాజకీయాలు చూసి జనం చీదరించుకుంటున్నారని ఎర్రొళ్ల ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలు తెలంగాణలో ఎన్ని కుప్పిగంతులు, సర్కస్​ ఫీట్లు వేసినా వృధా ప్రయాసేనన్నారు. సీఎం కేసీఆర్ ​సారథ్యంలోని టీఆర్​ఎస్​ప్రభుత్వం ప్రజా రంజక పాలన సాగిస్తుంటే.. చూసి ఓర్వలేక బీజేపీ నేతలు ఇక్కడ ఏదో కుంపటి పెట్టి చలికాచుకోవడానికి వచ్చారని నిప్పులు చెరిగారు. దేశంలో విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్ముతూ ప్రైవేట్​పరం చేస్తున్న ప్రధానమంత్రి మోడీకి ఇప్పుడు తెలంగాణ ఆస్తులపై కన్ను పడిందని ఆరోపించారు. మన ఆస్తులు, సంపద కొళ్లగొట్టడానికి వచ్చిన బీజేపీ మిడతల దండు పట్ల తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎర్రొళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed