అభయ ‘హస్తాన్ని’ ఆదరించండి : దామోదర రాజనర్సింహ

by Disha Web Desk 8 |
అభయ ‘హస్తాన్ని’ ఆదరించండి : దామోదర రాజనర్సింహ
X

దిశ,రేగోడ్:అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేసే అభయ హస్తం కాంగ్రెస్ పార్టీని ఆదరించి రానున్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించాలని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు, టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ కోరారు. అందోల్ నియోజకవర్గ స్థాయిలో రేగోడ్ మండల పరిధిలోని గజ్వాడ గ్రామంలో సోమవారం నాడు కాంగ్రెస్ హామీల ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సీడబ్ల్యూ సీ శాశ్వత సభ్యులు కొప్పుల రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వారికి గజ్వాడలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు ప్రచార, సమావేశ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీలను గ్రామ గ్రామాన, ఇంటింటికి నెరవేర్చనున్నామని ప్రకటించారు.చేయూత, ఇందిరమ్మ ఇండ్లు,రైతు భరోసా, యువ వికాసం,మహాలక్ష్మి, గృహ జ్యోతి పథకాల అమలుతో సంపూర్ణ సంక్షేమాన్ని అందరికీ కాంగ్రెస్ అందజేయనుందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీఆర్ఎస్ పాలనలో ప్రజా ధనం దుర్వినియోగం, అవినీతిమయం రాజ్యమేలుతుందని ఆరోపించారు.

రానున్న ఎన్నికల్లో ప్రజాకంటక ప్రస్తుత పాలనకు చరమ గీతం పాడి కాంగ్రేస్ కు ప్రజలు పట్టం కట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను అందరికీ తెలియజేయాలని వారు సూచించారు. సంగారెడ్డిలో రేగోడ్ చేరికకు మద్దతు: సంగారెడ్డి జిల్లాలో రేగోడ్ మండలాన్ని చేర్చే విషయంలో జరుగుతున్న జాప్యం విషయాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిగంబర్ రావ్ దామోదర దృష్టికి సభా ముఖంగా తీసుకువెళ్లారు.ఈ విషయంపై దామోదర్ మాట్లాడుతూ రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో చేర్చాల్సి ఉండగా ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు రేగోడ్ ను మెదక్ లో చేర్చి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు నిర్ణయాలను కాంగ్రెస్ సమర్థించదని,ధర్మాన్ని, న్యాయాన్ని తాము పాటిస్తామని సంగారెడ్డి లో చేర్చే విషయానికి ఆయన మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మున్నూరి కిషన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిగంబర్ రావ్, జెడ్పీటీసీ యాదగిరి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Next Story

Most Viewed