టోల్‌ గేట్‌లో ఉద్యోగాలు కల్పించాలని ధర్నా

by Disha Web Desk 15 |

దిశ, అందోల్ : జాతీయ రహదారి నిర్మాణ పనులను అడ్డగోలుగా చేపట్టారని, టోల్‌ గేట్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, 25 కిలో మీటర్ల దూరం ఉన్న గ్రామాలకు ఉచిత పాస్‌లను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్‌ మండలానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. సోమవారం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో 161 జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. జాతీయ రహదారి కావడంతో ఇరుపక్కల వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ధర్నా చేస్తారన్న సమాచారం మేరకు పోలీసులు ముందస్తుగా పెద్ద సంఖ్యలో ఉదయమే టోల్‌ ప్లాజ్‌ వద్దకు చేరుకున్నారు. టోల్‌ ప్లాజ్‌ వద్ద కాకుండా తాడ్‌దాన్‌ పల్లి చౌరస్తా వద్ద బైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న సమయంలో జోగిపేట నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న అంబులేన్సుకు దారిచ్చారు. ఇటీవల పుల్కల్‌ మండలం గంగోజీపేటకు చెందిన మురళీ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతనిని అసుపత్రికి తీసుకేళ్లేందుకు సంగారెడ్డికి వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. సంఘటన స్థలానికి 108 అంబులెన్సును రప్పించి, అతనిని సంగారెడ్డి అసుపత్రికి తరలించారు.

రెండు గంటలకు పైగా బైఠాయింపు

సమస్యల పరిష్కారం కోసం 161 జాతీయ రహదారిపై సుమారుగా రెండు గంటలకు పైగా ధర్నా చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డుపై ధర్నా చేస్తున్న వారిని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, నేషనల్‌ హైవే, టోల్‌ గేట్‌ అధికారులు వచ్చి హమీనిచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు వారికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని వారు హామీనివ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ధర్నా ముగిసిన వెంటనే ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

భారీగా మోహరించిన పోలీసులు

జాతీయ రహదారిపై ధర్నా చేస్తారన్న విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా తాడ్‌దాన్‌పల్లి టోల్‌గేట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, జోగిపేట సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సౌమ్యానాయక్, గణేష్‌లతో పాటు సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నాయకులు టోల్‌ప్లాజా వద్ద కాకుండా తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద ధర్నా చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఉద్రిక్త వాతావరణం

జాతీయ రహదారిపై చేపట్టిన ధర్నా కార్యక్రమం కొంత ఉద్రిక్తతకు దారీ తీసింది. తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద అండర్‌ పాస్‌ రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్‌ చేశారు. చౌరస్తా నుంచి సుమారుగా 25 గ్రామాల వరకు ఉంటాయని, ఆయా గ్రామాల ప్రజలు సంగారెడ్డి వైపు వెళ్లాలంటే నాలుగు కిలో మీటర్ల దూరం వేళ్లి యూ టర్న్‌ తీసుకుని వెళ్లాల్సి వస్తుందని, దీని వలన 8 కిలో మీటర్ల దూరం పెరుగుతుందన్నారు. తాడ్‌దాన్‌పల్లి వద్ద అండర్‌ పాస్‌ రోడ్డును ఏర్పాటు చే సేందుకు రైతులు జేసీబీని తెప్పించి, రోడ్డుపై డివైడర్‌ను పగలగొట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వారికి కొద్దిసేపు వాగ్వివాదం జరుగగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నేషనల్‌ హైవే సైట్‌ ఇంజనీర్‌లు అక్కడికి చేరుకుని హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లి అండర్‌ పాస్‌ రోడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

సమస్యలు పరిష్కరించకపోతే ఊరుకోం : నేతలు

జాతీయ రహదారి నిర్మాణంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని రాష్ట్ర ధర్మ ప్రసారక్‌ కో కన్వీనర్‌ సుభాష్‌ చందర్, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పల్లె సంజీవయ్య, నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌లు డిమాండ్‌ చేశారు. ప్రధానంగా టోల్‌పాస్‌కు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు ఫీజును మినహయింపు ఇవ్వాలని, ఉచితంగా పాస్‌లను ఇవ్వాలని డిమాండ్​ చేశారు. తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద అండర్‌ పాస్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో ఎందరో భూములను కొల్పోయారని, ఆ కుటుంబాలకు టోల్‌గేట్‌లలో ఉద్యోగాలను కల్పించాలన్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.



Next Story

Most Viewed