అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 15 |
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 55 కిలోమీటర్ల మేర ఉన్న సిద్దిపేట రింగ్ రోడ్డు పనుల్లో మార్చి నెలలోపు 40 కిలోమీటర్ల పూర్తి చేయాలని ఆర్అండ్ బీ అధికారులను ఆదేశించారు. మిగిలిన 15 కిలోమీటర్ల రింగురోడ్డు పనులు మే నెలలోపు పూర్తి చేసేలా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్, ఆర్అండ్ బీ అధికారులకు మంత్రి సూచించారు. అలాగే గజ్వేల్ రింగురోడ్డు పనుల ప్రగతిపై చర్చించి, మార్చి నెలలోపు యుద్ధప్రాతిపదికన మొత్తం పూర్తి చేయాలని ఆర్అండ్ బీ అధికారులను కోరారు. సిద్ధిపేట పట్టణం నుంచి ఏన్సాన్ పల్లికి డబుల్ లేన్ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. తడ్కపల్లి-మెట్టు వద్ద ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సిద్ధిపేట బీవీఏస్వీ వెటర్నరీ కళాశాల అడ్మిషన్లు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఫోన్ లైనులో మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట మున్సిపాలిటీ లో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డికి సూచించారు. సమీక్షలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, చిన్నకోడూర్ ఏంపీపీ మాణిక్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర ఆయిల్ ఫామ్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, ఆర్అండ్ బీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story