- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జొన్నల కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కిన రైతులు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు.

దిశ, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. గోనె సంచులు, లారీల కొరత కారణంగా కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో కంగ్టి–పిట్లం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి సరిపడా గోనె సంచులు, లారీలు అందుబాటులో లేకపోవడంతో జొన్నల కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన జొన్నలు తడిసి మొలకెత్తుతున్నాయని, దీంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని వాపోయారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ..
ప్రభుత్వం వెంటనే స్పందించి గోనె సంచులు, లారీల కొరతను తీర్చడంతో పాటు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా కంగ్టి–పిట్లం ప్రధాన రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న కంగ్టి ఎస్ఐ దుర్గారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తడ్కల్‌తో పాటు పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






