నేను వస్తున్నాని చెప్పినా ఇంత నిర్లక్ష్యమా...?: కలెక్టర్ సీరియస్

by Dishanational1 |
నేను వస్తున్నాని చెప్పినా ఇంత నిర్లక్ష్యమా...?: కలెక్టర్ సీరియస్
X

దిశ, మెదక్ ప్రతినిధి: ప్రసూతి అయిన వెంటనే కేసీఆర్ కిట్ అందజేసి రిజిస్టర్ లో వివరాలు నమోదు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, సేవలు వినియోగించుకునేలా ఆశావర్కర్లు, ఏఎన్ఏమ్ లు కృషి చేయాలని, సాధారణ కాన్పుల పట్ల అవగాహన కలిగించాలన్నారు. ఇక్కడ చూయించుకునే గర్భిణులు కూడా తోటి వారికి అవగాహన కలిగించి ప్రోత్సహించాలని సూచించారు. ఓ గర్భిణితో మాట్లాడుతూ మగ పిల్లవాడు పుడితే రూ. 12 వేలు, ఆడపిల్ల పుడితే రూ. 13 వేలతో పాటు కేసీఆర్ కిట్ అందిస్తున్నారని, సమయానుకూలంగా శిశువులకు ఇమ్మ్యూనైజేషన్ టీకాలు ఇప్పించాలని, గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.


జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చందూనాయక్, కార్యనిర్వాహక ఇంజనీరు రవీందర్ రెడ్డిలతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి, ప్రతి విభాగం వినియోగంలో ఉండాలని, అవసరమైన సిబ్బందిని వారికున్న ప్రొవిజన్ మేరకు నోటిఫికేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ లో తీసుకోవాలని సూచించారు. సిబ్బంది సమయ వేళలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని, బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు తీసుకోవాలని అన్నారు. ప్రతి శుక్రవారం, ఆదివారం మాత్రమే స్కానింగ్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెగ్యులర్ గా రేడియాలజిస్ట్ ఉండేలా చూడాలని, గైనకాలజిస్ట్ డాక్టర్ కూడా స్కానింగ్ చేయడంపై అవగాహన కలిగి ఉండాలని, స్కానింగ్ తీసిన వెంటనే రోగికి రిపోర్ట్ అందజేయాలని సూచించారు. కేసీఆర్ కిట్ బఫర్ స్టాక్ ఉంచుకోవాలని, టీకా మందులు కూలింగ్ ప్లేస్ లో భద్రపరచాలని సూచించారు. సిబ్బంది లేరని సాకులు చెప్పరాదని, ప్రైవేట్ ఆసుపత్రులలో ఎంత చక్కగా సేవలు అందిస్తున్నారో పరీక్షించాలని, అంతకన్నా మెరుగైన సేవలు అందించుటలో నిబద్దతతో పనిచేయాలని, అత్యవసరమైతే తప్ప చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు రెఫర్ చేయరాదని సూచించారు.

ఓపీ సేవలను మెరుగుపరిచి ప్రతిరోజూ ఎక్కువ మందికి సేవలు అందేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారితోపాటు వచ్చేవారు కూర్చునేందుకు వీలుగా లాన్ లో కుర్చీలు, ఫ్యాన్ల్ ఏర్పాటు చేయాలని, రూ. 3 లక్షల విలువ గల ఫర్నీచర్ ఇవ్వడానికి దాతలు ముందుకువచ్చినందున వెంటనే ప్రతిపాదనలు అందజేయవలసినదిగా సూచించారు. ఆపరేషన్ థియేటర్, ప్రసూతి వార్డు, ఇంక్యూబులెటెర్ గదిని, ఆక్సిజన్ గదిని పరిశీలించి అవసరమైన ఆక్సిజన్ నిలువలు ఉన్నాయా అని ఆరాతీశారు. ఎక్స్ రే, ఫీడింగ్ సెంటర్ వంటి కొన్ని విభాగాలు మూసి ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఆసుపత్రికి వస్తున్నానని ముందస్తుగా సమాచారమిచ్చినా పరిస్థితి ఇలా ఉందంటే ఎలా అని ప్రశ్నించి, ఈరోజు విధులలో ఉన్న సిబ్బంది వివరాలు వెంటనే అందజేయవలసిందిగా డా. చంద్రశేఖర్ ను ఆదేశించారు. ఎంతో సునిశితమైన ప్రసూతి వార్డులకు డాక్టర్లు రౌండ్స్ కు వచ్చినపుడు మాత్రమే దర్శకులను అనుమతించాలని సూచించారు. ఆసుపత్రిలో పెండింగు పనులు ఉన్నాయా, తూప్రాన్ లో రక్త నిధి భవనం ఆధునీకరణ, మెదక్ లో రేడియాలజీ భవన నిర్మాణ పనులను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఏంసీహెచ్, ఇంజనీర్ రవీందర్ రెడ్డికి సూచించారు. కలెక్టర్ వెంట మునిసిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, తహశీల్ధార్ శ్రీనివాస్, డాక్టర్ శివదయాళ్, తదితరులు ఉన్నారు.

Next Story