సంగారెడ్డి జిల్లా జైలుకు సెంట్రల్ హోదా..

by Disha Web Desk 12 |
సంగారెడ్డి జిల్లా జైలుకు సెంట్రల్ హోదా..
X

దిశ, కంది: సెంట్రల్ జైలు ప్రతిపాదన చివరకు ఓకే అయింది. ఇప్పటిదాకా సంగారెడ్డి జిల్లా జైలుగా ఉన్న జైలుకు సెంట్రల్ హోదాను కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జీవోను విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లా జైలుకు కూడా సెంట్రల్ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సిద్దిపేట జిల్లాలో మరో కొత్త జిల్లా జైలు మంజూరు తో పాటు దాని నిర్మాణానికి రూ.90 కోట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. త్వరలోనే మంత్రి చేతుల మీదుగా ఈ జైలు పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలోని కంది మండల కేంద్రం పరిధిలో జిల్లా జైలు ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటిదాకా సంగారెడ్డి జిల్లా జైలుగా ఉన్న జైలుకు సెంట్రల్ హోదాను కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జీవోను విడుదల చేసింది. ఈ జైలును సెంట్రల్ జైలుగా మార్చాలని అప్పటి అధికారులు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. గత సంవత్సరమే ఈ జైలుకు సెంట్రల్ హోదా వచ్చే అవకాశం ఉన్న ఆ ప్రతిపాదనను అప్పుడు పక్కన పెట్టారు. తాజాగా గత డిసెంబర్ 29న సంగారెడ్డి జిల్లా జైలుకు సెంట్రల్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

దీంతో పాటు నిజామాబాద్ జిల్లా జైలును కూడా సెంట్రల్ జైలుగా మంజూరు కల్పించింది. దీంతో ఎప్పటినుంచో సెంట్రల్ జైలుకు అర్హత కలిగి ఉన్న సంగారెడ్డి జిల్లా జైలుకు సెంట్రల్ హోదా రావడంతో ఇక్కడి ప్రాంత ప్రజలు, జైలు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ హోదాతో పెరుగనున్న వసతులు, అధికార సిబ్బంది సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 33 మంది గార్డెన్లు ఉన్నారు.

అలాగే ముగ్గురు జైలర్లు, ఒక సూపరింటెండెంట్ అధికారి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ జైల్లో 502 మంది ఖైదీలు శిక్షణ అనుభవిస్తున్నారు. అయితే సంగారెడ్డి జిల్లా జైలుకు సెంట్రల్ హోదా దక్కడంతో ఇక్కడ వసతులతోపాటు అధికార సిబ్బంది పెరుగనున్నారు. సెంట్రల్ హోదా దక్కడంతో ఇక్కడ 80 నుంచి 100 మంది గార్డెన్ల సిబ్బందిని నియమించనున్నారు. అలాగే ఒక ఎస్పీ స్థాయి కేడర్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఇద్దరు డిప్యూటీ సూపరిండెండెంట్ లు, నలుగురు జైలర్లు ఇక్కడ విధులు నిర్వహించనున్నారు.

అలాగే ఖైదీల కోసం మరిన్ని బ్యారెకులను కొత్తగా నిర్మిస్తారు. దీంతోపాటు లోపల కొత్తగా పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తానికి సంగారెడ్డి జిల్లా జైలు సెంట్రల్ జైలుగా హోదా కల్పించడంతో జైలు రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయి. అతి త్వరలోనే సంగారెడ్డి జిల్లాలో సెంట్రల్ జైలుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి

Read Disha E-paper

Next Story