బీఆర్ఎస్‌కు కర్ర కాల్చి వాత పెట్టాలి : ఈటల

by Disha Web Desk 22 |
బీఆర్ఎస్‌కు కర్ర కాల్చి వాత పెట్టాలి : ఈటల
X

దిశ, వర్గల్: గజ్వేల్ ప్రజలు చైతన్యవంతులని, డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలకు లొంగదీసుకుంటామని భావిస్తే అది వారి భ్రమే అవుతుందని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచారం గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని దండుపల్లి, మజీద్ పల్లి, మైలారం, నెంటూర్ వర్గల్ ఆయా గ్రామాలలో మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘనంగా ఊరేగింపుగా ఈటలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... 9 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వనోడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత సన్న బియ్యం ఇస్తానంటే ఎలా నమ్ముదామని ప్రశ్నించారు. తన కార్యక్రమానికి రాకుండా అధికార పార్టీ నేతలు గ్రామాల్లో అడ్డుకుంటున్నట్లు సమాచారం ఉందని, చైతన్యవంతులైన గజ్వేల్ ప్రజలను ఎంతో కాలం ఇక మభ్యపెట్టలేరని ఎద్దేవా చేశారు. వర్గల్ ప్రాంతంలో 10 సంవత్సరాల పాటు ఇళ్ళు, పౌల్ట్రి వ్యాపారం ఉండేదని , వర్గల్ క్షేత్రంతో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా డబ్బులు, ప్రలోభాలను పాతరేసి ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడుకుంటూ ప్రజలు తనను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారన్న నమ్మకం ఉందని చెప్పారు.

మన భూములు మనం కాపాడుకోవాలి అంటే ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఒడగొట్టాలి అని ధ్వజమెత్తారు. ఏ ఇంటికి ఆ ఇళ్లే కథానాయకులు అవ్వాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ బీఆర్ఎస్‌కు కర్ర కాల్చి వాత పెట్టాలని కోరారు. పేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కేసీఆర్ వేల ఎకరాలను లాక్కొని వారిని అడ్డా కూలీలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో మహాభారత యుద్ధం జరగబోతుందని, కౌరవులకు, పాండవులకు జరుగుతున్న యుద్ధంలో అంతిమ విజయం పాండవులదే అని స్పష్టం చేశారు. పథకాలు ఆపడానికి వారి సొంత డబ్బు కాదని, తనను ఆదరించి ఆశీర్వదిస్తే మీలో ఒకడిగా ఉంటానని వివరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టేకులపల్లి రామ్ రెడ్డి, గజ్వేల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ జిల్లా అధికార ప్రతినిధి నందన్ గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీకాంత్, బీజేవైయం రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Next Story