అధికారం అండతో బీఆర్ఎస్ అక్రమాలు చేసింది

by Sridhar Babu |
అధికారం అండతో బీఆర్ఎస్ అక్రమాలు చేసింది
X

దిశ, పటాన్చె రు : అధికారంలో ఉన్న రెండు పర్యాయాలలో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా అక్రమాలు చేసి ప్రజా సంపదను దోచుకున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బుధవారం చిట్కుల్ లో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ అవలంబించాల్సిన విధానాలు, ప్రచార సరళి పై పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయంలో జరిగిన అక్రమాల గుట్టు రోజుకొకటి బయటకు వస్తుందని, ఈ అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఒకపక్క లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత జైలు పాలు అయిందని, మరొకపక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల పేర్లు రోజుకొకటి బయటకు వస్తున్నాయని తెలిపారు.

ప్రజా సంపదను దోచుకున్న ప్రతి ఒక్కరిగుట్టు విప్పి తీరుతామని, ఈ అక్రమాల్లో ప్రమేయం ఉన్న వారికి శిక్ష తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలతో ప్రజలంతా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని వెల్లడించారు. గతంలో మహానేత దివంగత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఉండడంతో ఈ పార్లమెంట్ స్థానంలో కచ్చితంగా ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇద్దామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాటలు మాత్రమే చెప్తాడని ఎద్దేవా చేశారు. మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులంతా కష్టపడి పనిచేసి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పటాన్ చెరు, నర్సాపూర్, దుబ్బాక, సిద్ధిపేట ఇన్చార్జిలు కాట శ్రీనివాస్ గౌడ్, ఆవుల రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పూజల హరికృష్ణ, మెదక్ డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed