గజ్వేల్.. నర్సాపూర్.. ఎక్కడ బెటర్… భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్

by Dishafeatures2 |
గజ్వేల్.. నర్సాపూర్.. ఎక్కడ బెటర్… భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: అధికార టీఆర్ఎస్ కంచుకోటలా మారిన ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి హరీశ్​రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో బలపడడం ద్వారా ఆ సంకేతాలు రాష్ట్రం మొత్తం ప్రభావం చూపిస్తాయని బావిస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను బీజేపీలో చేర్చుకోవడంపై నజర్ పెట్టారు.

టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ పొన్నాల రఘుపతిరావుతో పాటు పలువురు ముఖ్యనేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరితో పాటు నర్సాపూర్, గజ్వేల్, పటాన్ చెరు, సంగారెడ్డి, జహీరాబాద్‌ల నుంచి ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారు.

అయితే వీరి చేరికల సందర్భంగా గజ్వేల్ లేదా నర్సాపూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ గత రెండు రోజులుగా జిల్లా నేతలతో చర్చలు జరుపుతున్నారు. దసరా తర్వాత నిర్వహించనున్న ఈ భారీ సభ ద్వారా ఉమ్మడి మెతులో టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చి బీజేపీలో జోష్ నింపుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సభ ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుంది..? అనే అంశం ప్రధాన చర్చకు వచ్చినట్లు తెలిసింది.

లీడ్ తీసుకుంటున్న మురళీయాదవ్..

ఇటీవలే అధికార టీఆర్ఎస్‌కు దూరమైన ఆ పార్టీ మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న విషయం తెలిసిందే. కాగా ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా నర్సాపూర్ సర్పంచ్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయనకు అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలున్నాయి. మురళీయాదవ్ తాను బీజేపీలో చేరడంతో పాటు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులను చేర్పించాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే రోజువారీగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో మురళీయాదవ్ మాట్లాడుతున్నారు. అంతే కాకుండా ఫోన్ కలిపి నేరుగా ఈటల రాజేందర్‌తో కూడా మాట్లాడిస్తున్నారు. పార్టీలో మంచి అవకాశాలుంటాయని ఈటలతో భరోసా ఇప్పిస్తున్నారు. టీఆర్ఎస్‌లో ఇంకా ఏం వచ్చేది లేదని, ఈ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని చెబుతున్నారు. మురళీయాదవ్‌తో పాటు గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్‌కు చెందిన సీనియర్ టీఆర్ఎస్ లీడర్ పొన్నాల రఘుపతిరావు, పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ శంకర్ యాదవ్, టీఆర్ఎస్‌కు చెందిన కొందరు బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారు.

వీరితో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పార్టీలోకి చేర్చుకోవడంపై జిల్లా నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఇటీవలే గుమ్మడిదల నుంచి యువకులు టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ సమక్షంలో గుమ్మడిదలలోనే చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండడంతో భారీ సభ పెట్టాలని నిర్ణయించారు.

ఈటల రాజేందర్ సుదీర్ఘ చర్చలు..

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇతర పార్టీల నుంచి చేరికలు, భారీ బహిరంగ సభ నిర్వహణపై నాయకులతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో బీజేపీ నేతలతో పాటు బీజేపీలో చేరనున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు కూడా ఉంటున్నారు. సభ ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుంది..? అనే అంశం ప్రధాన చర్చకు వచ్చినట్లు తెలిసింది. గజ్వేల్ లేదా నర్సాపూర్‌లో సభ పెడితే బాగుంటుందని జిల్లా నాయకులు ఈటలకు సూచించారు. నర్సాపూర్ ఉమ్మడి జిల్లాకు మధ్యలో ఉంటుందని కొందరు, గజ్వేల్‌లో నిర్వహించడం ద్వారా బీజేపీ సత్తా చాటుకునే అవకాశం ఉంటుందని మరికొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

పెద్ద ఎత్తున జనసమీకరణ ఉండేలా ప్లాన్ చేయాలని, ఈ సభతో ఉమ్మడి జిల్లాలో బీజేపీకి ఓ ఊపు రావాలని భావిస్తున్నారు. బీజేపీ ఎక్కడుందని మాట్లాడుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇవ్వాలని, అన్ని నియోజకవర్గాల నుంచి ఇతర పార్టీల ముఖ్య నాయకుల చేరికలు ఉండేలా చూడాలని ఈటల జిల్లా నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు.

శనివారం కూడా జిల్లాకు చెందిన ఈటలతో చర్చల్లోనే ఉన్నారు. బీజేపీలో చేరడానికి నాయకులతో పాటు కింది స్థాయి కార్యకర్తలు కూడా ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో అలాంటి వారందరితో మాట్లాడాలని ఈటల సూచించినట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై స్పష్టత రానున్నదని పార్టీ నాయకులు చెప్పారు.

నేతల మధ్య సక్యత కుదిరేనా..?

ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి రావడానికి పలువురు నేతలు సిద్ధం అవుతుండగా జిల్లా బీజేపీ నేతలు ఎవరికి వారే అన్న చందంగా ఉండటం గమనార్హం. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఒక దుబ్బాకలో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో కొంత బీజేపీలో ఊపు కనిపిస్తుండగా మిగతా చోట్ల పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. పార్టీలోని నేతలను సమన్వయ పరిచి పార్టీ బలోపేతం చేయడంలో జిల్లా అధ్యక్షులు విఫలం అవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

అధికార టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావడానికి ముఖ్య నేతలు సిద్ధం అవుతుండగా బీజేపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడాన్ని చూసి వెనక్కి తగ్గుతున్నారు. జిల్లాలో పార్టీ నాయకులు, పార్టీ బలోపేతంపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నదో వేచి చూడాల్సి ఉన్నది. మొత్తంగా ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులు బీజేపీలో చేరనున్నారనే వార్తలు మాత్రం కొత్త వరకు బీజేపీకి ఊపుతెప్పితస్తున్నాయని చెప్పుకోవచ్చు.


Next Story