వాళ్లు వేస్తున్నారు.. వీళ్లు తొలగిస్తున్నారు

by Disha Web Desk 12 |
వాళ్లు వేస్తున్నారు.. వీళ్లు తొలగిస్తున్నారు
X

దిశ, పటాన్ చెరు: హైదరాబాద్ మహానగరంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కొల్లాపూర్. ఈ ప్రాంతంలో కండ్లు బైర్లుగమ్మే బహుళ అంతస్థుల భవనాలతో పాటు, ఖరీదైన విల్లాల నిర్మాణం జరుగుతున్నది. ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే స్థాయిలో ప్రభుత్వ భూముల కబ్జాలు, ఆక్రమణలు కామన్ అయిపోయాయి. ముఖ్యంగా వరద నీటి కాలువలు, పంట కాలువలు, శిఖం భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ఈ ఆక్రమణలపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్తుల ఆందోళనతో కదులుతున్న అధికార యంత్రాంగం అక్కడక్కడ చర్యలకు ఉపక్రమిస్తుంది. కానీ అధికారుల ఆదేశాలను రియల్ వ్యాపార పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అధికారులు చర్యలకు ఉపక్రమించిన మరుక్షణమే యథావిధిగా తమ ఆక్రమణ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అధికారుల ఆదేశాలను సైతం బుట్ట దాఖలు చేస్తూ ఆక్రమణల పర్వం కొనసాగుతుండడంతో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు నవ్వుకుంటున్నారు.

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మేళ్ల చెరువు, వనం చెరువులోని మత్తడి ద్వారా వచ్చే వరద నీటి కాలువ గర్ధుల బాట ఆక్రమణకు గురవుతున్నది. 6 నెలల క్రితం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ కాలువపై రోడ్డు నిర్మాణం చేయడంతో గ్రామస్తులు తిరగబడ్డారు. రోడ్డు నిర్మాణాన్ని తొలగించాలని భీష్మించుకుని కూర్చున్నారు. ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కదిలిన అధికార యంత్రాంగం అక్రమంగా కాలువపై నిర్మించిన రోడ్డును తొలగించివేశారు.

అయితే కొన్ని నెలల పాటు స్తబ్దుగా ఉన్న ఆక్రమణల పర్వం మళ్లీ ఊపందుకుంది. అదే కాలువపై రెండు రోజుల కింద మళ్లీ పైపులు వేసి రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. మరొకసారి స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నీటిపారుదల శాఖ అధికారులు పైపులను రోడ్డును తొలగించారు. అయితే అధికారుల చర్యలకు సవాల్​ విసురుతూ తొలగించి ఒకరోజు కూడా కాకుండానే మళ్లీ పైపులు వేసి రోడ్డు నిర్మాణం మొదలుపెట్టారు.

అధికార వ్యవస్థకే సవాల్..

అధికారులు ఆక్రమమని కాలువపై నిర్మించిన రోడ్డును తీసివేశారు. సాక్షాత్తు రామచంద్రపురం నీటిపారుదల శాఖ ఏఈఈ సంతోషిని ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన రోడ్డును తొలగించారు. అయితే అధికారులు అక్రమ రోడ్డుని తొలగించి ఒక రోజు కూడా గడవకముందే మళ్లీ అదే స్థానంలో తిరిగి రోడ్డు నిర్మాణం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారులు తొలగించిన రోడ్డును పునర్నిర్మించడం అధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తుంది.

అధికారులు దగ్గరుండి కాలువను పునరద్ధరించినా లెక్కచేయకుండా తిరిగి కాలువను పూడ్చడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార వ్యవస్థలకే సవాల్​ విసురుతున్న అక్రమార్కుల బరితెగింపు వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి అక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story