11వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

by Disha Web Desk 22 |
11వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
X

దిశ, సంగారెడ్డి: కనీస వేతనం, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 11 రోజులకు చేరుకుంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో గురువారం సమ్మెలో భాగంగా రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శశికళ మాట్లాడుతూ.. గత 11 రోజుల నుండి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని అందులో భాగంగా ఈరోజు రోడ్లు ఊడుస్తూ నిరసన తెలుపడం జరిగిందన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి అని ఆశించిన కార్మికవర్గానికి నిరాశే ఎదురైందన్నారు. పని ఒత్తిళ్లు, అధికారుల వేధింపులు, సమయానికి రావాల్సిన సరుకులు రాకపోవడం లాంటి అనేక ఇబ్బందులు వారికి పెరిగిపోతున్నాయన్నారు. చంద్రబాబు హయంలో ఛలో హైదరాబాద్ పిలుపులో భాగంగా వెళ్ళితే కార్మికులపై గుర్రాలతో తొక్కించి, లాఠీచార్జీ చేసీ వాటర్ ట్యాంకర్లతో కొట్టించిన ప్రభుత్వం నేడు ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నారు. ఉద్యోగులు సమ్మెలో ఉంటే, ఇతర రంగాల ఉద్యోగులను తీసుకువచ్చి ఆ సెంటర్లను ఓపెన్ చేసేల ఒత్తిడి చేయడం సరికాదన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా ప్రకటించి కనీస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

రెగ్యులరైజేషన్, కనీస వేతనం, గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ అంగన్వాడీల రిటర్మెంట్ వయసు, బతికున్నప్పుడు కావాల్సిన వాటిని విడిచి దహన సంస్కారాలకు టీచర్ కు రూ.20 వేలు, ఆయాలకు రూ.10 లు నిర్ణయించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి డిమాండ్లు పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు డి.లక్ష్మీ, అనిత, సుజాత, రుక్మిణి, విజయ, భూలక్ష్మి, సంతోషా, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Next Story