తారాస్థాయికి అందోల్​–జోగిపేట మున్సిపల్‌ అవిశ్వాసం

by Disha Web Desk 15 |
తారాస్థాయికి అందోల్​–జోగిపేట మున్సిపల్‌ అవిశ్వాసం
X

దిశ,అందోల్ : అందోల్​–జోగిపేట మున్సిపాలిటీ అవిశ్వాస అంశం తారాస్థాయికి చేరుకుంది. గత రెండు రోజులుగా మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ను గద్దె దింపాలని అధికార పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస పత్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఇన్‌ వార్డులో అందజేసిన విషయం పాఠకులకు తెలిసిందే. తాజాగా సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ శరత్‌ను కలిసి అవిశ్వాస పత్రాన్ని అందజేశారు. మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ల వివరాలను జిల్లా కలెక్టర్‌ శరత్‌ వారిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిస్థితిపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాసం అమలుకు కొత్తగా ప్రభుత్వం నాలుగేండ్లకు పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిందని, ఈ బిల్లు ఇంకా ఆమోదం జరుగలేదన్నారు. మీరిచ్చిన అవిశ్వాస పత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తానని, మీకు సంబంధించిన కౌన్సిలర్‌ ఐడీ కార్డులను కూడా మున్సిపాలిటీ నుంచి తెప్పించుకుంటానని కలెక్టర్‌ చెప్పినట్లు కౌన్సిలర్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపినట్లు వారు చెప్పారు. అనంతరం అందోల్​–జోగిపేట మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబును సోమవారం సాయంత్రం కలిసి అవిశ్వాస పత్రాన్ని అందజేశారు. కలెక్టర్, కమిషనర్‌ను కలిసిన వారిలో బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు నాగరాజు (నాని), దుర్గేష్, చందర్, భవాని నాగరత్నం గౌడ్, పడిగె సుమిత్ర సత్యం,భారతి, మాధవి, పిట్ల భాగ్యలక్ష్మమ్మ లక్ష్మణ్, ప్రవీణ, జాకియ సుల్తానా, గాజుల ధనలక్ష్మి అనిల్‌ కుమార్‌ ఉన్నారు.


Next Story

Most Viewed