ఆ సార్ రూటే ఓ ‘‘రేటు’’.. వెలుగులోకి విద్యాధికారి రాజేష్ ‘‘వసూళ్ల’’ లీలలు!

by Disha Web Desk 19 |
ఆ సార్ రూటే ఓ ‘‘రేటు’’.. వెలుగులోకి విద్యాధికారి రాజేష్ ‘‘వసూళ్ల’’ లీలలు!
X

దిశ, పటాన్ చెరు: ఏసీబీ వలలో పట్టుబడిన సంగారెడ్డి జిల్లా విద్యాధికారి లీలలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులు ఇస్తే అనుమతులతో పనిలేదు. అన్ని అక్రమాలు మాఫీ. గతంలో రెండు సార్లు అవినీతిలో పట్టుపడ్డ సారు తీరు మారలేదు.. అలవాటు పడ్డ ప్రాణం అంత తొందరగా వదలదు అన్నట్లు ముచ్చటగా మూడో సారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. లంచాలకు అలవాటైన సర్ జిల్లాలో రిచెస్ట్ ప్రాంతమైన పటాన్ చెరుపై కన్నేశాడు. సర్‌కు పత్రికల్లో కథనాలు వస్తే ఇక పండుగే.. కథనాలపై చర్యల మాట అటుంచి అక్రమాలను చర్యలను తొక్కిపెట్టి వసూళ్ల పర్వానికి తెరలేపుతాడు. పాఠశాలలో టీచర్లు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన హోదాలో ఉండి తప్పులను ప్రోత్సహిస్తూ లంచాలు పుచ్చుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఏసీబీ వలలో చిక్కిన డీఈఓ రాజేశ్​రూటే సపరేటు. ప్రభుత్వ నుంచి ఎలాంటి అధికారిక బదిలీలు లేనప్పటికీ సదరు అధికారి మాత్రం జిల్లాలో పలువురి బదిలీలకు సహకరించి వారికి అనుకూల ప్రాంతానికి బదిలీ చేసిన సంఘటనలు ఉన్నాయి. ముడుపులు సమర్పించుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా డిప్యూటేషన్‌పై అవలీలగా బదిలీలు చేస్తారని విద్యా శాఖలో గుసగుసలు వినబడుతున్నాయి.

శాఖాపరమైన చర్యలలో ఉన్న ఉపాధ్యాయులను సైతం క్రమశిక్షణ చర్యలలో లక్షల్లో డబ్బు తీసుకొని కోరుకున్న చోటుకి బదిలీ చేస్తారని ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చర్యల పేరుతో పట్టణ ప్రాంతానికి బదిలీ చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాను అనుకుంటే ఏదైనా సాధ్యమే అనే రీతిలో జిల్లా విద్యాధికారి రాజేశ్​ వ్యవహార శైలి ఉండేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

పరీక్ష ఫీజులో వాటా..

పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు నిబంధనల ప్రకారం తీసుకోకుండా ఒక్కొక్కరి దగ్గర ఫీజుకు అదనంగా రూ.1000 వరకు వసూలు చేసేలా స్థానిక విద్యాధికారులకు డీఈఓకు డీల్ కుదిరి అధిక ఫీజు వసూలుకు తెర లేపారనే ఆరోపణలున్నాయి. ప్రయివేటు పాఠశాలలను కేటగిరీలుగా విభజించి ఒక్కొక పాఠశాలకు ఒక్కొక విధంగా వసూళ్ల టార్గెట్లను ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మండల స్థాయి విద్యాధికారులకు సైతం వాటాలు వెళ్లినట్లు సమాచారం. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాటాల జోరు కొనసాగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఎవరికి చెప్పిన విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

పైసలిస్తే అన్ని సక్రమమే..

జిల్లాలోని సంపన్న నియోజకవర్గమైన పటాన్ చెరులో అనుమతి లేని పాఠశాలలకు నిలయంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా విషయమై పత్రికలు వెలుగులోకి తీసుకొస్తే చర్యలు తీసుకోవాల్సింది పోయి సహకరించారన్న ఆరోపణలున్నాయి. పటాన్ చెరు మండలంలో అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న ఒక పాఠశాల తో పాటు అనుమతులు రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చిన మరొక కార్పొరేట్ పాఠశాలకి అనుకూలంగా వ్యవహరిస్తూ అన్ని తానై చక్రం తిప్పి సదరు పాఠశాలలకు సహకరించారన్న విమర్శలున్నాయి.

అమీన్పూర్ మండలంలోని మరొక రెండు పాఠశాలలకు ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న చర్యల విషయంలో వెనకడుకు వేశారని తెలుస్తుంది. పూర్తిగా ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి ప్రవేట్ విద్యాసంస్థల మాఫియాకి అందలం ఎక్కించాడని ఘాటుగా విమర్శిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ముసుగులో ప్రైవేట్ పాఠశాలలను సందర్శించి పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి పాల్పడినట్లు ఆరోపణలు షికారు చేస్తున్నాయి.

పనితీరుతో పనిలేదు మామూళ్లకే విలువ..

జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్ మొదటినుండి అక్రమార్కులకి సహకరిస్తారన్న వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇటీవల పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో విద్యార్థులతో పారిశుద్ధ పనులు చేపిస్తున్న విషయం పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చిన డీఈవో మాత్రం సదరు ఉపాధ్యాయులకు వంత పాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు రామచంద్రపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విదేశీ పర్యటనలో ఉన్న ఉపాధ్యాయురాలికి సహకరించిన ఎంఈఓ విషయంలో పెద్ద ఎత్తున పత్రికల్లో కథనాలు వచ్చిన డీఈవో మాత్రం నామమాత్రంగా విచారణ జరిపించినట్లు వెల్లడవుతోంది. ఆరోపణలు వచ్చిన సిబ్బంది నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి సదరు ఉపాధ్యాయులకు వంత పాడినట్లు ఆరోపణలున్నాయి.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక మహోన్నత పదవిలో ఉంటూ దానికి కళంకంతో వచ్చేలా వ్యవహరిస్తూ లంచాలు వేటలో తన విధి నిర్వహణను మర్చిపోవడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా విద్యాశాఖలో ఇలాంటి అవినీతి అధికారి ఉంటే ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపించి విధినిర్మాణమరిచేలా ఉపాధ్యాయులు తయారవుతురన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి అధికారిని విధుల్లో నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed