యజమాన్యం నిర్లక్ష్యానికి కార్మికుడు బలి.. పరామర్శించిన ఎమ్మెల్యే

by Disha Web Desk 19 |
యజమాన్యం నిర్లక్ష్యానికి కార్మికుడు బలి.. పరామర్శించిన ఎమ్మెల్యే
X

దిశ, చౌటకూర్: విధి నిర్వహణలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రం చౌటకూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బంగ్లా తుల్జారాం గౌడ్ ( 21) కొన్ని ఏళ్లుగా స్థానిక ఈఎంపీఈఈ డిస్టిలరిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఉదయం విధులకు వెళ్లాడు. బియ్యం బాయిలర్ యూనిట్ వద్ద పని చేస్తో్న్న క్రమంలో ప్రమాదవశాత్తు బియ్యం బస్తాలు మీద పడి ఊపిరాడక మృతి చెందాడు. అయితే, బియ్యం బాయిలర్ యూనిట్ వద్ద నలుగురైదుగురు వ్యక్తులు పని చేయాల్సి ఉండగా.. పరిశ్రమ యాజమాన్యం ఒక్కరితోనే పనిచేయిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు.

పరిశ్రమలోని వివిధ యూనిట్లలో ఎలాంటి రక్షణ చర్యలు లేవని.. ఇప్పటి వరకు ముగ్గురు కార్మికులు ఇలాగే మృత్యువాత పడ్డారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకొని బోరున విలపించారు. ఈ మేరకు పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా.. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, చౌటకూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నత్తి దశరథ్ హుటాహుటీన పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.





Next Story

Most Viewed