సిద్దిపేట జిల్లాలో 92.8 శాతం

by Disha Web Desk 22 |
సిద్దిపేట జిల్లాలో 92.8 శాతం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కొనసాగింది. జిల్లాలో 93, 667 మంది ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించగా 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 194 ఉప కేంద్రాల పరిధిలోని 586 పోలియో కేంద్రాల్లో తొలిరోజు 86,245 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 37 మొబైల్ టీంల ద్వారా 1753 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించినట్లు డీఎంహెచ్‌వో కాశీనాథ్ తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వచ్చి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. మొబైల్ టీంల ద్వారా మరో రెండు రోజుల పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్ లో పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతుందని, ఈ సదవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని డీఎంహెచ్‌వో కాశీనాథ్ సూచించారు.

రెండు చుక్కల పోలియో మందు నిండు జీవితం..

రెండు చుక్కల పోలియో మందు నిండు జీవితాన్ని కాపాడుతుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, డీఎంహెచ్‌వో కాశీనాథ్‌తో కలిసి ప్రారంభించారు. 38వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకం లక్ష్మణ్, పయ్యావుల ఎల్లం, మున్సిపల్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed