సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్‌కు అవిశ్వాస గండం

by Disha Web Desk 12 |
సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్‌కు అవిశ్వాస గండం
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ చైర్మన్లు, చైర్ పర్సన్ల పై సభ్యుల అవిశ్వాస తీర్మానాల పరంపర కొనసాగుతోంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్‌కు కూడా అవిశ్వాస గండం పొంచి ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. బొంగుల విజయలక్ష్మి చైర్ పర్సన్‌గా బాద్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఓ కౌన్సిలర్ నేతృత్వంలో రహస్యంగా సమావేశం అయ్యారు. చైర్ పర్సన్ భర్త రవి ఒంటెద్దు పోకడలు, అలాగే అభివృద్ధి పనుల విషయంలో పలు వార్డులపై వివక్ష చూపడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యతిరేకంగా కూటమి కట్టారు. మున్సిపాలిటీలో అధికార పార్టీలోని కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. అవిశ్వాసం పెట్టడానికి సరిపడా మంది కౌన్సిలర్ల మద్దతు ఉందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

మున్సిపాలిటీలో 38 స్థానాలు

సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులున్నాయి. మూడేళ్ల క్రితం ఎన్నికలు కాగా మున్సిపాలిటీని అధికార బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మున్సిపల్ చైర్ పర్సన్‌గా బొంగుల విజయలక్ష్మి రవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ కావడం, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా కావడంతో నిధులు కూడా వస్తున్నాయి. నారాయణఖేడ్‌కు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు కేటాయించిన విషయం కూడా విదితమే. ఇదిలా ఉండగా అందరితో కౌన్సిలర్లను కలుపుకుని పోవాల్సిన చైర్ పర్సన్ ఒంటెద్దు పోకడలకు పోవడంపై సభ్యులు ఆగ్రహిస్తున్నారు. నిధుల విషయంలో వివక్ష చూపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

7వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో

మున్సిపాలిటీలోని 7వ వార్డు కౌన్సిలర్ బోయిని విజయలక్ష్మి శేఖర్ ఆధ్వర్యంలో కొందరు కౌన్సిలర్లు కొద్ది రోజులుగా రహస్యంగా సమావేశాలు జరుపుతున్నారు. చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మిని దింపాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అవిశ్వాసం పెట్టడానికి చాలా మంది మద్దతు వస్తుందని కౌన్సిలర్లు చెబుతున్నారు.

చైర్ పర్సన్ భర్త రవి తీరు తమకు నచ్చడం లేదని, ఈ విషయాన్ని పలు సందర్భాల్లో మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ల దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు ఓ కౌన్సిలర్ చెప్పాడు. వరుసగా వారు మున్సిపాలిటీని ఏకచత్రాదిపత్యంగా ఏలుతున్నారని, ఈ క్రమంలో వారిలో తన ఇష్టం అనే భావన పెరిగిందని మండి పడుతున్నారు. అందరూ కలిసి అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ముందుగానే కోర్టును ఆశ్రయించడానికి

తనపై సభ్యులు అవిశ్వాసం పెట్టనున్నట్లు సమాచారం అందుకున్న చైర్ పర్సన్ విజయలక్ష్మి, రవిలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో అవిశ్వాస తీర్మానంపై కోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. తాను కూడా ముందుగానే కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడానికి చైర్ పర్సన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మంత్రి హరీష్ రావు ద్వారా అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లకు నచ్చజెప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీలో, అలాగే టీఆర్ఎస్ పార్టీలో చైర్ పర్సన్‌కు పదవులు దక్కాయని, పార్టీ కోసం పనిచేసే వారికి కూడా అవకాశం రావాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ఇతర పార్టీల సభ్యులతో కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

అధికార పార్టీలో చర్చనీయాంశం

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్ పర్సన్ కు అవిశ్వాసం పెట్టనున్నట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల పంచాయతీని కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు వాడుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది..? అనే ఆసక్తి నెలకొంది.

ఈ వ్యవహారాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చక్కదిద్దుతారా..? మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగుతారా..? ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లనున్నదనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా అవిశ్వాసం అనే మాటే రాకుండా చూసుకుంటానని చైర్ పర్సన్ మాత్రం గట్టి దీమాతో ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. చూడాలి ఏం జరగనుందో...


Next Story

Most Viewed