భవిష్యత్తు అంతా.. ఎలక్ట్రిక్ వాహనాలదే : మంత్రి కేటీఆర్

by Disha Web Desk 1 |
భవిష్యత్తు అంతా.. ఎలక్ట్రిక్ వాహనాలదే : మంత్రి కేటీఆర్
X

దిశ, జహీరాబాద్ : భవిష్యత్తు అంతా.. ఎలక్ట్రిక్ వాహనాలదేనని, ఈ వాహనాలు తెలంగాణ అడ్డాగా మారనున్నాయని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జహీరాబాద్ లోని మహీంద్రా అండ్ మహీంద్రాలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందన్నారు.

కాలుష్య నిర్మూలనకు ఎలక్ట్రికల్ వాహనాలకు పెద్దపీట వేయడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. దేశ విదేశాల్లో కూడా మహీంద్రా వాహనం సూపర్ హిట్ గా నిలుస్తుందన్నారు. పరిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ ప్రాంతంలో యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వ ఖర్చుతో స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలు ఇందుకు సహకరించి, అవసరమైన నైపుణ్య శిక్షణనిచ్చి 80 నుంచి 90 శాతం స్థానికులకు ఉద్యోగాలివ్వాలని కంపెనీ ప్రతినిధులను కోరారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక బద్ధమైన అభివృద్ధిని కోరుకుంటుందన్నారు. ఉత్పత్తి జరగాలంటే ఇన్నోవేషన్ , రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ కూడా జరగాలన్నారు. సెల్ మేకింగ్, బ్యాటరీ మేకింగ్ కూడా ఇక్కడే జరిగితే ఒకే చోట టూవీలర్ మొదలు, బస్సులు, కారులు, ఆటోలు ఇక్కడే తయారవుతాయన్నారు. భారతదేశానికి ఎలక్ట్రిక్ వాహనాల తయానికి తెలంగాణ ఒక అడ్డగా మారుతుందన్నారు. ప్రభుత్వం ఉపాధి సృష్టించే లక్ష్యం, చిత్తశుద్ధితో ఇలాంటి నూతన పాలసీలను తీసుకొస్తుందన్నారు. స్థానిక యువత మహీంద్రా తీసుకొస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిల్ వాహనాల తయారీని అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తెలంగాణ రాష్ట్రం దేశంలోని అతిపెద్ద మొబిలిటీ వ్యాలీ అవుతుందన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు

ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. ఎండాకాలంలో విపరీతమైన ఎండలు, వర్షాకాలంలో సకాలంలో వానలు రాకపోవడం, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం, పర్యావరణం విపరీతంగా దెబ్బతినడానికి కారణం వాహనాలు వదిలే వదిలే కార్బన్ వ్యర్థ పదార్థాలు అన్నారు. ఇవి అన్నీ పోవాలంటే డీ కార్బనైజేషన్ జరగాలన్నారు. కార్బనైజేషన్ లేని, కాలుష్యం లేని వాహనాలు అవసరమన్నారు. ఇందు కోసం ఎలక్ట్రికల్ వాహనాలకు పెద్దపీట వేయడమే ఒకటే పరిష్కారమని అన్నారు. 2020లో ఎలక్ట్రికల్ వాహనాల కోసం కొత్త పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇందులో భాగంగా టీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టామన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ఎలక్ట్రిక్ కారు, బైక్ ఇతర వాహనాలు కొన్న వారికి ప్రోత్సహిస్తున్నమని తెలిపారు. మహేంద్ర తీసుకొస్తున్న ఎలక్ట్రికల్ వాహనాలు 4కి.మీ. దూరంలోని గమ్యాలకు ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్ , సంగారెడ్డి, సదాశివపేట్ రాకపోకులకు ఇలాంటి వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే..

ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. కార్గో వాహనాలు సైతం ఎలక్ట్రికల్ కు మారే అవకాశం ఉందన్నారు. టూ వీలర్ మొదలు ఆటో, కారు, బస్సు ఇలా అన్ని వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలే రానున్నాయన్నారు. అందుకే కొత్త విధానం తీసుకొచ్చి ఎలక్ట్రికల్ రంగంలో పనిచేసేవారికి ప్రోత్సహించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ రంగాల్లో పని చేసే నిపుణులకు తయారీదారులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు.

వీరందరి కోసం తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పేరుతో ప్రత్యేక పాలసీ తెచ్చామన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఫార్ములా ఈ రేసింగ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందన్నారు. కార్లతో జరిగే రేస్ నిర్వహించేందుకు దేశంలో మొదటి సారిగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎంచుకొని, నిర్వహించారని తెలిపారు. మొబిలిటీ వ్యాలీలో మూడు భాగాలు ఉన్నాయని ఒకటి జహీరాబాద్, రెండోది మహబూబ్ నగర్, చివరిది వికారాబాద్ జిల్లాలో నెలకొల్పి ఇన్నోవేషన్, రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ కు పెద్దపీట వేస్తూ చర్యలు తీసుకున్నామన్నారు.

దేశ, విదేశాల్లో సూపర్ హిట్..

ఎలక్ట్రికల్ వాహనాలకు చక్కని భవిష్యత్తు ఉందని, సభా వేదిక వరకు నడుపుకుంటూ వచ్చానని, ఎలక్ట్రికల్ వాహనాలు చాలా చక్కగా ఉన్నాయన్నారు. ఈ వాహనం దేశ విదేశాల్లో కూడా సూపర్ హిట్ అవుతుందన్నారు. దీంతో ఎంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే అక్కడున్న కార్మిక రంగం, యాజమాన్యానికి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు.

అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సర్వతోముఖాభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాంతిభద్రతలు నెలకొల్పాలి, మంచి విధానాలు ఉండాలి, మంచి విధానాల అమలు సవ్యంగా జరిగే వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కర్మాగార యాజమాన్యం, కార్మికవర్గం మధ్య చక్కని రిలేషన్ ఉండాలని అన్నారు. పరిశ్రమలు, కార్మికులు, యాజమాన్యానికి ప్రభుత్వానికి త్రికోణ సంబంధం ఉండాలన్నారు.

టీఎస్ ఐపాస్ తో 23 వేల అనుమతులు

అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా టీఎస్ ఐపాస్ తో 23 వేలకు పైగా అనుమతులిచ్చామని, రూ.3లక్షల 3౦ వేల కోట్లు పైచిలుకు పెట్టబడును సాధించామన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో టీఎస్ ఐపాస్ తీసుకుని వచ్చి 16 రోజుల్లో అనుమతులకు చర్యలు తీసుకున్నామన్నారు. విప్లవాత్మకమైన ఈ చట్టం తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దేశం మొత్తానికి పారిశ్రామిక విధానంలో, అవినీతి రహిత, పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.

సుమారు 20 లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామన్నారు. నైపుణ్యత పెంచుకోవాలి కంపెనీలకు అవసరమైన నైపుణ్యాన్ని స్థానిక యువత పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు. జహీరాబాద్ లో ఉన్న నిమ్స్ లో, మహీంద్రా ఇతర కర్మకారాల్లో కొత్తగా వస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలన్నారు. స్థానికంగా జహీరాబాద్ , సంగారెడ్డి ప్రాంత యువతకు ఆయా కంపెనీలలో ఉపాధి పొందేందుకు వీలుందన్నారు. స్థానిక యూనిట్లో ఉద్యోగ అవకాశాలు 80, 90% స్థానిక యువతకే కల్పించాలని మహీంద్రా అండ్ మహీంద్రా సీఈఓ సుమిత్ర మిశ్రాను కోరారు.

స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలని కోరారు అందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. సాధ్యమైనంత ఎక్కువమందికి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఖర్చుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దేశం మొత్తంలో పరిశ్రమల యాజమాన్యాలకు అన్ని విధాల సహకరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మని తొమ్మిదేళ్లలో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మనలోని తెలివితేటలు, చాతుర్రానికి పరీక్ష అన్నారు. ఇంట్లో కూర్చుంటే ఉద్యోగాలు మనల్ని వెతుక్కుంటూ రావని స్పష్టం చేశారు.

నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగానికి అవసరమైన రీతిలో సంసిద్ధం కావాలన్నారు. ప్రధానంగా పరిశ్రమలు కూడా స్థానికంగా ఉండే నైపుణ్యంగల అభ్యర్థులకు ప్రాధాన్యత నిస్తారన్నారు. కలెక్టర్ డాక్టర్. శరత్, ఎంపీ బేబీ పాటిల్ , ఎమ్మెల్యే కె.మాణిక్ రావు, డిసిఎంఎస్ ఇతర ప్రజాప్రతినిధులంతా చొరవ తీసుకొని విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఖర్చుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి వారిలో నైపుణ్యం పంతులుగా తీర్చిదిద్దాలన్నారు.

ఈ సమావేశంలో మహీంద్రా ప్రతినిధులు, సంబంధీకులు రాజీవ్ గోయల్, పరిశ్రమల కార్యదర్శి జెయేష్ రంజన్, ఐఎంఎఫ్ ప్రతినిధి వెండి వెర్నర్, మహీంద్రా సీఈవో సుమన్ మిశ్రా, ఎమ్మెల్యే కె. మాణిక్ రావు, జిల్లా కలెక్టర్ డాక్టర్. శరత్ , సిఐటియు రాష్ట్ర నాయకులు చుక్క రాములు, కబాడీ శంకర్ నారాయణ, డి సి ఎం ఎస్ చైర్మన్ ఎం. శివకుమార్, సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, టీఎంఎస్ అధ్యక్షులు హుగ్గెల్లి రాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు ఎండి.తంజీం , మంకాల్ సుభాష్ , మహీంద్రా అండ్ మహీంద్రా అధికారులు, కార్మికులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed