తెలంగాణ రాజకీయాల్లో కలకలం.. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హత్యకు కుట్ర!

by Disha Web |
తెలంగాణ రాజకీయాల్లో కలకలం.. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హత్యకు కుట్ర!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మావోయిస్టుల కదలికలు మరోసారి టెన్షన్ పెట్టిస్తున్నాయి. తాజాగా ఉత్తర తెలంగాణలోని గోదావరి తీరంలో మావోయిస్టులు వేసిన భారీ స్కెచ్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా హత్యకు రెక్కీ నిర్వహించారనే పోలీసుల అనుమానం టీఆర్ఎస్ పార్టీలో కలవరానికి గురి చేస్తున్నది. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హత్య చేసేందుకు ఇటీవల రెక్కి నిర్వహించినప్పటికీ సామాజిక, భౌగోళిక అననుకూలత కారణాలతో వెనుకడగు వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

ఆ ముగ్గురు ఎమ్మెల్యేల హత్యకు స్కెచ్

ఈ ఆపరేషన్ కోసం టైమ్ బాంబు తరహా పేలుళ్లకు పన్నాగం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలైన దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్‌లు మావోయిస్టుల లిస్టులో ఉన్నారని వీరిని హత్య చేసి సులువుగా తప్పించుకునే ప్రణాళిక వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకోసం మావోయిస్టు అగ్రనేతలు ప్రవేశించి రెక్కీ సైతం నిర్వహించినట్లు తెలుస్తున్నది. హత్య అనంతరం సులువుగా తప్పించుకుని మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి నిమిషాల్లో పారిపోయే వీలుగా పక్కా స్కెచ్ వేసుకున్నారని ఇందుకోసం రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉండే బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎటాక్ చేసి నిమిషాల వ్యవధిలో బార్డర్ దాటేయవచ్చని అంచనాలతో ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. అదే రామగుండం ఏరియా మొత్తం మైదాన ప్రాంతం కావడంతో అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా సులువుగా పట్టుబడతామని అందువల్ల తొలుత బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలను టార్గెట్ గా ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. రెక్కీ నిర్వహించినా ఎలాంటి హింసకు పాల్పడకపోవడం వెనుక బలమైన కారణాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ కారణాలతో వెనక్కి?

హత్య విషయంలో ప్రణాళిక అంతా సిద్ధం చేసుకున్నాక ఎంచుకున్న ఎమ్మెల్యేల విషయంలో వారి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్ లు ఇద్దరూ దళిత ఎమ్మెల్యేలే కావడం వల్ల వీరిపై దాడికి దిగితే ప్రజల్లో వ్యతిరేకత ఎదురయ్యే సూచనలతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలుస్తున్నది. ఇక రామగుండం ఎమ్మెల్యే విషయంలో దాడి తర్వాత తప్పించుకునేందుకు భౌగోళికంగా అనుకూల పరిస్థితులు ఉండవని భావించి దాడికి ముందడుగు వేయలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఉత్తరాన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న రాష్ట్రంలోకి ప్రవేశించారని అలాగే ఎన్టీపీసీ, ఎఫ్సీఐ, గోదావరిఖని పారిశ్రామిక వాడల్లో ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల్లో మావోయిస్టులకు సానుభూతి పరులు ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు.. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై 24 గంటల నిఘా ఉంచారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన మావోయిస్టుల పోస్టర్లను గోదావరికి ఇరువైపు అతికించి ఎవరైనా వీరిని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే మావోయిస్టుల హిట్ లిస్టులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్

కనుమరుగైపోయారనుకున్న మావోయిస్టుల కదలికలు మళ్లీ రాష్ట్రంలో జోరందుకుంటుందనే ప్రచారం టెన్షన్ పెట్టిస్తోంది. ఏపీలో గత ఎన్నికలకు 6 నెలల ముందు అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమన్నను మావోయిస్టులు హత్య చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లకుంటే మరో ఏడాది తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు అధికార పార్టీ ఎమ్మెల్యేలే టార్గెట్ గా రెక్కి నిర్వహించినట్లు నిఘా వర్గాలు గుర్తించడం సంచలనంగా మారుతోంది. ఈ వ్యవహారం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజాసింగ్ పీడీ యాక్ట్‌పై ముగిసిన విచారణ.. వివరించిన పోలీసులు.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed