బడ్జెట్ అంచనా తారుమారు.. కాగ్ నివేదికలో వెల్లడి

by Disha Web |
బడ్జెట్ అంచనా తారుమారు.. కాగ్ నివేదికలో వెల్లడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వేసిన అంచనాలు లెక్క తప్పుతున్నాయి. కాగ్ వెల్లడించిన ప్రాథమిక నివేదికతో ఈ విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ. 3,754 కోట్ల మేర మిగులులో ఉంటుందని అంచనా వేసినా డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలోనే అది రూ.2,211 కోట్ల లోటులోకి వెళ్లిపోయింది. దాదాపు రూ.5,965 కోట్ల మేర నష్టం చవిచూసింది.

మైనస్ రూ.2,211 కోట్ల లోటులోకి వెళ్లింది. మరోవైపు సంక్షేమం కోసం మొత్తం పన్నెండు నెలల వ్యవధిలో రూ.లక్ష కోట్లను (కాపిటల్ రూ.6,687 కోట్లు కలుపుకొని) ఖర్చు చేయాలని అంచనా వేసుకుంటే తొమ్మిది నెలల్లో కేవలం రూ.43,026 కోట్లను మాత్రమే ఖర్చు చేయగలిగింది. దళితబంధుకు బడ్జెట్‌లో రూ.17,700 కోట్లను కేటాయించుకున్నా ఒక్క పైసా విడుదల కాలేదు. మొత్తం రూ.1.26 లక్షల కోట్లు పన్నెండు నెలల్లో వస్తుందని అంచనా వేయగా డిసెంబరు చివరి నాటికి దాదాపు 73 శాతం మేర లక్ష్యాన్ని సాధించింది. జీఎస్టీ, స్టేట్ ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా.. తదితరాల్లో 68 శాతం నుంచి 73 శాతం వరకు రాబట్టుకోగలిగింది.

20 శాతం మాత్రమే..

ఇక రిజర్వుబ్యాంకు ద్వారా రుణాల రూపంలో సుమారు రూ.52,167 కోట్లను అందుకోవాలని లెక్కలు వేసుకున్నా ఎఫ్ఆర్‌బీఎం పరిమితులతో అది రూ.36,750 కోట్లకు మాత్రమే వెసులుబాటు లభించింది. దాదాపు మూడింట ఒక వంతు అంచనాలు లెక్క తప్పాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.52,227 కోట్లు వస్తుందని ఆశిస్తే తొమ్మిది నెలల వ్యవధిలో కేవలంరూ.7,770 కోట్లు మాత్రమే సాకారమైంది. కేవలం ఇరవై శాతం మాత్రమే పొందగలిగింది. దాదాపు రూ.30 వేల కోట్లకు పైగానే చేజారిపోయినట్లయింది.

కేంద్ర నిధులపై ఆశలు

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని గతేడాది (2021-22) అంచనా వేసుకున్నా ఆ మేరకు అందలేదు. అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంతకన్నా ఎక్కువే వస్తుందని బడ్జెట్‌లో రూ.52 వేల కోట్ల కన్నా ఎక్కువే అంచనా వేసుకున్నది. గతేడాదితో పోలిస్తే అటు కేంద్ర ప్రభుత్వంతో, ఇటు అధికారంలో ఉన్న బీజేపీతో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆ గ్రాంట్లు 20 శాతం కూడా రాష్ట్రానికి అందలేదు. మరో వారం రోజుల్లో వచ్చే ఏడాది కోసం బడ్జెట్ కసరత్తు జరుగుతూ ఉన్నది. ఈసారి సైతం కేంద్రం నుంచి భారీ స్థాయిలోనే గ్రాంట్ల రూపంలో ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాశారు.

వరుసగా రెండేళ్ల నుంచి..

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో అందవనే అనుమానం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్థికశాఖ అధికారులకు ఉన్నప్పటికీ లెక్కల ప్రకారం బడ్జెట్‌లో పెట్టుకోవడం ద్వారా డిమాండ్ చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్ సైజు పెంచుకోడానికే ఈ లెక్కలను చూపిస్తున్నారన్న విమర్శలు సరేసరి. వరుసగా రెండేళ్ల నుంచి కేంద్రం నుంచి గ్రాంట్లు అందకపోయినా ఈసారి కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఉంటాయని ఆర్థికశాఖ వర్గాల సమాచారం. జీఎస్‌డీపీ పెరగడంతో రిజర్వుబ్యాంకు ద్వారా ఈ సంవత్సరం కూడా రుణాలను 3.5 శాతం మేర చట్టబద్ధంగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసుకునే అవకాశం ఉన్నది.Next Story