రజకులకు వాషింగ్ మెషిన్ లను పంపిణీ చేశాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Kalyani |
రజకులకు వాషింగ్ మెషిన్ లను పంపిణీ చేశాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: సమాజానికి రజకులు చేసే సేవ, తల్లి తన పిల్లలకు చేస్తున్న సేవతో సమానంగా భావించి ధోబీ ఘాట్లకు చరమగీతం పాడి వారికి వాషింగ్ మిషన్ లను అందజేశామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం స్థానిక న్యూటౌన్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రజక యువజన క్రాంతి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రసంగించారు.

సమైక్య రాష్ట్రంలో రజకులకు ధోబీ ఘాట్లను ఏర్పాటు చేసి గొప్పగా చెప్పుకునేవారని, తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రజకుల కష్టాన్ని దూరం చేయాలనే ఆలోచనలతో వారికి పెద్ద పెద్ధ వాషింగ్ మిషన్ లను అందజేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కుల వృత్తుల వారికి అందుబాటులోకి తెచ్చి వారికి అండగా నిలిచారని అన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 70లక్షల నిధులతో వాషింగ్ మిషన్ లను రజక సోదరులకు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు కిషోర్, నవకాంత్, రజక సంఘం అధ్యక్షుడు నాగన్న, కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు కోట్లాది రూపాయల విలువైన స్థలాలు, నిధులు తమ ప్రభుత్వం అందజేసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్థానిక గాయత్రీ ఫంక్షన్ హాల్ లో జరిగిన దేవాంగ కుల సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు.

ఒకప్పుడు బీసీలందరూ ఒకే కులంగా ఉండేవారని, క్రమంగా వివిధ వృత్తులుగా విడిపోయారని, ఆ వృత్తులే నేడు కులాలుగా మారిపోయాయని ఆయన అన్నారు. అన్ని కులాల వారిని తమ ప్రభుత్వం ఆదుకొని అండగా ఉన్నామనే విషయాన్ని సమస్త బీసీలు అందరూ గుర్తించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో దేవాగ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరభద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, కార్యదర్శి రవికుమార్, లింగం, కౌన్సిలర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed