పరిగి బీఆర్ఎస్‌ కేడర్‌లో జోష్..!

by Disha Web Desk 12 |
పరిగి బీఆర్ఎస్‌ కేడర్‌లో జోష్..!
X

దిశ, పరిగి: నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి తన పట్టును బిగిస్తున్నారు. సంక్షేమ పథకాల్లో చురుకుగా పాల్గొంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళంతో ప్రజలకు చేరువవుతున్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు, పార్టీ పరంగా ఉన్న లోటు పాట్లను తెలుసుకుంటున్నారు. వాటిని సరి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం లక్నాపూర్, రంగాపూర్, కాళ్లాపూర్​గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో దాదాపు 12 గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇందులో లక్నాపూర్, బసిరెడ్డిపల్లి, కాళ్లాపూర్​గ్రామాల సర్పంచులు కాంగ్రెస్​అభ్యర్థులు కావడంతో ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్​పార్టీని పటిష్టం చేసుకునేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లను అధిగమిస్తూ వన్​వేగా ఓటర్లను తన వైపునకు తిప్పుకునేందుకు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

సొంత పార్టీలో కుంపటి పోరు..

ఓ వైపు ఎమ్మెల్యే కొప్పుల ఆత్మీయ సమ్మేళనంతో కాంగ్రెస్, ఇతర పార్టీలకు పట్టున్న గ్రామాలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుండగా సొంత పార్టీలో కుంపటి పోరు మొదలైంది. డీసీసీబీ చైర్మన్ ​బుయ్యని మనోహర్​రెడ్డి కూడా నియోజవకర్గం వ్యాప్తంగా పరిగి, దోమ, పూడూరు, కుల్కచర్ల, చౌడాపూర్​మండలాల్లో కొప్పుల మహేశ్​రెడ్డిపై అలకబూనిన, చిన్న చూపు చూస్తున్న నాయకులను టార్గెట్​చేస్తూ కొంత కాలంగా బీఆర్ఎస్​ పార్టీలోనే బీఎంఆర్​వర్గం తయారు చేసుకున్నాడు.

టికెట్​నాకే వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కేఎంఆరా..? బీఎంఆరా..? అని కొందరు ఊగిసలాడుతున్నారు. ఇటీవలే పరిగి మున్సిపల్​ఆత్మీయ సమ్మేళనంలో స్వయంగా మంత్రి సబితారెడ్డి ఈ సారి కూడా ఎమ్మెల్యేగా కొప్పుల మహేశ్​రెడ్డిని గెలిపించాలని చెప్పడంతో తటస్తంగా ఉన్న బీఆర్ఎస్​ నాయకులు మహేశ్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు.

11 నుంచి ‘పల్లె పల్లెకు కొప్పుల’..

పరిగి ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యేగా మరోసారి కొప్పులను గెలిపించాలని కార్యకర్తలను కోరడంతో బీఆర్ఎస్​ కేడర్‌లో నూతనోత్సాహం వెలువడింది. దీంతో కొప్పుల కూడా నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యేందుకు 11న ‘పల్లె పల్లెకు కొప్పుల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బసిరెడ్డి పల్లి, రంగాపూర్, మాదారం, పేటమాదారం, పోల్కంపల్లి, నజీరాబాద్ బర్కత్‌పల్లి, రుక్కుంపల్లి, నస్కల్ గ్రామాల్లో పల్లెబాట నిర్వహించి రాత్రికి బస చేయనున్నారు. ఈ గ్రామాల్లో సమస్యలను స్వయంగా తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులో మాట్లాడి పరిష్కర మార్గాలు చేయించనున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలతో చర్చించి పార్టీ పటిష్టతకు కృషి చేయనున్నారు.

పరిగి మున్సిపల్​‌పై ప్రత్యేక దృష్టి..

మున్సిపల్‌లోని 15 వార్డుల్లో 7, 8, 9, 10, 11, 13 వార్డులో కాంగ్రెస్​పార్టీ బలపరిచిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. ఇందులో 7వ, 11 వార్డుల కౌన్సిలర్లు కాంగ్రెస్​ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. మిగిలిచన వార్డులపై కూడా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసమే ఇటీవల ఆత్మీయ సమ్మేళనంతో మరోసారి నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.

Next Story

Most Viewed