ఈ మురికి కూపాన్ని ఇంకా ఎన్నేళ్ళు భరించాలి..?

by Aamani |
ఈ మురికి కూపాన్ని ఇంకా ఎన్నేళ్ళు భరించాలి..?
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ముందు ప్రవహిస్తున్న పెద్ద నాలా నుంచి వచ్చే డ్రైనేజీ వ్యర్థాల దుర్వాసనను ఎన్నో ఏళ్లుగా భరించలేక పోతున్నామని డిపో కార్మికుల,బస్ స్టాండ్ ప్రయాణికులు ఆరోపించారు.పైగా దోమలు విపరీతంగా పెరిగి మలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా,వైరల్ ఫివర్ లాంటి రోగాల బారిన పడుతూ,అనారోగ్యంతో డ్యూటీలు చేయలేక సిక్ అవుతున్నామని డిపో కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు.బస్ డిపో,బస్ స్టాండ్ ఒకే ఆవరణలో ఉండడం,నిత్యం దాదాపుగా 1200 బస్సులు,సుమారు 20 వేల మంది ప్రయాణికులు వస్తూ పోతూ ఉండే బస్ స్టాండ్ సరిపోక నానా అవస్థలకు గురవుతున్నామని,నాలా నుంచి వచ్చే కంపు వాసనను తాము కూడా భరించలేక పోతున్నామని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.అంతే కాకుండా నాలా నుండి అప్పుడప్పుడు శిశువుల మృతదేహాలు,బయటపడుతుంటాయని,వాటిని కుక్కలు,పందులు పీక్కు తినటం లాంటి దృశ్యాలు కంట పడుతుంటాయని డిపో కార్మికులు మనోవేదన చెందారు.

రోజురోజుకు ప్రయాణికుల తాకిడి,బస్సుల సంఖ్య పెరుగుతుండడం,బస్సులను మలుపు తిప్పడానికి కాని,పార్కు చేయడానికి కాని,ఏ మాత్రం స్థలం సరిపోవడంలేదని,అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని డ్రైవర్లు ఆరోపించారు.వర్షం వేస్తే చాలు బస్ స్టాండ్,డిపో పెద్ద చెరువు ను తలపిస్తుందని,డిపో లోని ఆయిల్ డ్రమ్ములు,టైర్లు కొట్టుకుపోయి డిపో కాంపౌండ్ వాల్ కు తాకి ఆగిపోతుంటాయని కార్మికులు తెలిపారు.ఇక్కడ ఉన్న నాలా ను డైవర్టు చేసి,పూడ్చి వేస్తే బస్ స్టాండ్ కొంత విశాలంగా మారి,బస్సుల రాకపోకలకు అనువుగా ఉంటుందని,గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి ఈ సమస్యను అనేక సార్లు తీసుకవెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు.ఇకనైనా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బస్ స్టాండ్ ను,డిపో ను సందర్శించి,'నాలా' పై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కార మార్గాన్ని రూపొందించాలని ప్రయాణికులు,డిపో కార్మికులు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed