- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా పాలన ఫలితాలే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇన్‌చార్జి మధుసూదన్ రెడ్డి
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం కేంద్రంలోప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా మంగళవారం గోపాల్ పేట మండల కేంద్రంలో భారీ ప్రజా సభ నిర్వహించారు.

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం కేంద్రంలోప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా మంగళవారం గోపాల్ పేట మండల కేంద్రంలో భారీ ప్రజా సభ నిర్వహించారు. జానపద కళాకారులు పాటలు, కళారూపాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇన్‌చార్జి మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యశీలారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండున్నరేళ్ల కాలంలోనే ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకువచ్చిందన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించడం ద్వారా కోట్లాది కుటుంబాలకు ఊరటనిచ్చిందన్నారు. మహిళా సంఘాలకు భారీ స్థాయిలో బ్యాంకు లింకేజీ రుణాలు అందజేయడంతో పాటు మహిళల ఆర్థిక సాధికారత కోసం పలు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.20,616 కోట్ల రైతు రుణమాఫీ అమలు చేసిందన్నారు. రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమా, సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు రైతులకు అండగా నిలిచాయని వివరించారు. గృహ జ్యోతి పథకం ద్వారా 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద తొలి విడతలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సొంత స్థలం ఉన్న పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, రెండేళ్లలో 67,763 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ పరీక్షల నిర్వహణతో పాటు వార్షిక జాబ్ క్యాలెండర్ అమలు చేస్తోందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ,కొత్త రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల మంజూరు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు వంటి కార్యక్రమాలు ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపడుతోందని, సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, భారీ ఫ్లైఓవర్లు, ఐటీ పెట్టుబడుల ఆకర్షణ వంటి కార్యక్రమాలతో తెలంగాణను ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, తాగునీటి ప్రాజెక్టులు, కొత్త రహదారుల నిర్మాణం, ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం, ప్రజాభవన్‌లో అందరికీ ప్రవేశం కల్పించడం వంటి చర్యలు ప్రజల ప్రభుత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి యువజన నాయకులు ఆదిత్య, కాంగ్రెస్ నాయకులు శివన్న,కొంకి వెంకటేష్, మేస్త్రి బాలయ్య, చంద్రశేఖర్,వెంకటయ్య,బ్యాదరీ శాంతయ్య, సురేష్,వేమారెడ్డి, శ్రీనివాస్ చారి,ఎల్లయ్య,మల్లేష్, రవి,శివ వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






