హత్యాయత్నం కేసును చేధించిన పోలీసులు

by Shiva Kumar |
హత్యాయత్నం కేసును చేధించిన పోలీసులు
X

భూ వివాదాలే కారణం: ఎస్పీ నరసింహ

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని బాయమ్మ తోట వద్ద 7న రియల్ ఎస్టేట్ వ్యాపారి హాబీబ్ ఉర్ రెహమాన్, అతని కుమారుడు అబ్దుల్ రెహమాన్ పై జరిగిన హత్యాయత్నం కేసును చేధించినట్లుగా ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి రెండు స్కూటీలు, ఒక బైక్, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన కరీంకు అల్లిపూర్ గ్రామం వద్ద సర్వే నెం.30, 34 ,29 ,27, 53 ,54 ,55, 56, 58, సర్వే నెంబర్లలో మొత్తం 196 ఎకరాల పట్టా భూమి ఉండేది. ఆయన మరణించిన తర్వాత ఆ భూమి కుమారులైన ఎండీ.రషీద్, ఎండీ.హకీమ్ లకు చెందకుండా కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి వెంచర్ చేసి వేరే వ్యక్తులకు అమ్మేశారు. ఈ క్రమంలో సమస్యాత్మకమైన ప్లాట్లు, భూములు తక్కువ ధరలకు కొని, ఎక్కువ ధరలకు అమ్ముకునే ఆసీమ్, అబ్దుల్ అహ్మద్, ఇజాజ్ తో కలిసి మొత్తం 16 మంది కరీం కుమారులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి 60 శాతం తమకు, 40 శాతం కరీం వారసులకు పొలం దక్కే విధంగా జీపీఏ చేసుకున్నారు.

జీపీఏలో భాగస్థలైన అలీమ్ సంతకాలు ఫోర్జరీ చేసి తెలియకుండా 8 ప్లాట్లు ఇతరులకు విక్రయించారు. ఈ విషయంపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. అలీ నిందితులకు తెలియకుండా ఎండీ హబీబ్ రెహమాన్ కు జీపీఏ చేశాడు. రహమాన్ పొలం వద్దకు వెళ్లి ఒక గదిని నిర్మించుకున్నాడు. అనంతరం తన స్నేహితుడైన రౌడీషీటర్ సైతాన్ ఫారూఖ్ ను పెట్టుకొని వెళ్లి పొలం వద్దకు వస్తే చంపేస్తానని మిగతా వారిని బెదిరించాడు. ఈ క్రమంలో ఆసీమ్, అబ్దుల్ అహ్మద్, ఇజాజ్ ముగ్గురు కలిసి రహమాన్ ను చంపకుంటే ఒకే ముప్పు వస్తుందని భావించి మహమ్మద్ అబ్దుల్ నవాజ్, మహమ్మద్ రహమత్ లను ఆశ్రయించి హబీబ్ రహమాన్ ను చంపేందుకు సహకరిస్తే ఒక్కరికి 200 గజాల స్థలం తాము అని ఒప్పందం చేసుకున్నారు.

మరో రౌడీ షీటర్ మహమ్మద్ గౌస్ పాషా అలియాస్ గోరెబా ఒక ఎకరం పొలం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అందరూ కలిసి 15 రోజుల క్రితం అబ్దుల్ ఖాదర్ దర్గా దగ్గర ఉన్న షాపు నుంచి వచ్చి వెళ్లే క్రమంలో ఒకసారి, మెట్టు గడ్డ వద్ద మరోసారి చంపాలని భావించారు. కానీ అక్కడ జనావాసం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. చివరకు హాబీబ్ ఉర్ రహమాన్ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవడానికి సత్యమన్న విగ్రహం వద్ద ఉన్న ఓ హాస్పిటల్ కు ప్రతిరోజూ వెళుతున్నాడని గుర్తించి.. ఆ అవకాశాన్ని నిందితులు సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు.

ఈ క్రమంలో 7న రాత్రి, 7.30 సమయంలో ప్రాంతంలో ఇంజక్షన్ తీసుకొని తిరిగి వస్తుండగా బయమ్మ తోట వద్ద నిందితులు హబీబ్ ఉర్ రహమాన్, కుమారుడు అబ్దుల్ రెహమాన్ పై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తండ్రీ, కొడుకులు చాకచక్యంగా వ్యవహరించడంతో తీవ్ర గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనను సవాలుగా తీసుకొని పాలమూరు యూనివర్సిటీ వద్ద అనుచరిస్తున్న నిందితులలో షేక్ ఆసీమ్, ఎండీ అహ్మద్, మహ్మద్ అబ్దుల్ నవాజ్, ఎండీ రహమత్, మహమ్మద్ గౌస్ పాషా ను అరెస్టు చేసి, అత్యాయత్నానికి ఉపయోగించిన రెండు స్కూటీలు, ఒక మోటార్ సైకిల్, మూడు కత్తులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఎండీ ఇజాజ్ అహ్మద్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లుగా ఎస్పీ తెలిపారు.

Next Story