ఔను వాళ్ళిద్దరూ విడిపోదామనుకున్నారు.. న్యాయమూర్తి కౌన్సిలింగ్ తో ఒక్కటయ్యారు..!

by Disha Web Desk 20 |
ఔను వాళ్ళిద్దరూ విడిపోదామనుకున్నారు.. న్యాయమూర్తి  కౌన్సిలింగ్ తో ఒక్కటయ్యారు..!
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : కుటుంబ కలహాలతో కోర్టును ఆశ్రయించిన దంపతులు న్యాయమూర్తి చేసిన కౌన్సిలింగ్ ద్వారా తిరిగి ఒక్కటయ్యారు. పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన ఎం.అనూష, ఎం.రాముడు లకు 04 డిసెంబర్ 2022 న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కాగా కుటుంబ కలహాల కారణంతో ఇద్దరిమధ్యన మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. నాగర్ కర్నూల్ లోని జిల్లా న్యాయసేవా సంస్థలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.

మూడు వాయిదాలు అనంతరం శుక్రవారం న్యాయమూర్తి చొరవతో ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక్కటయ్యారు. ఇకమీదట విడిపోయే ఆలోచన రానివ్వమని న్యాయమూర్తి సమక్షంలోనే మరోసారి దండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కుటుంబంలో ఇలాంటి చిన్నచిన్న మనస్పర్ధలు సహజమేనని వాటిని ప్రేమతో, సున్నితంగా మన్నించుకుంటూ జీవిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపారు. దంపతులు ప్రేమగా కలకాలం పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సూపరింటెండెంట్ దేవిక, సిబ్బంది పుష్పలత తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed