జడ్చర్లను కబ్జాల నుంచి కాపాడండి: కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డి

by Disha web |
జడ్చర్లను కబ్జాల నుంచి కాపాడండి: కాంగ్రెస్ నేత అనిరుద్  రెడ్డి
X

దిశ, జడ్చర్ల: జడ్చర్ల కేంద్రంగా భూకబ్జాలు జోరందుకున్నవి, వీటి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనంపల్లి అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జడ్చర్ల పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జడ్చర్ల పట్టణంలో భూకబ్జాలు అధికమయ్యాయని దీంతో జడ్చర్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని, కబ్జాలకు గురైన ప్లాట్ల లబ్ధిదారులకు వెంటనే న్యాయం జరిగే విధంగా స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలన్నారు. భూ కబ్జాదారులకు వంతపాడుతున్న జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జడ్చర్ల పట్టణాన్ని సేవ్ జడ్చర్ల పేరిట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని జడ్చర్ల ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుతామని పట్టణంలో తిరుమల, శ్రీ వెంకటేశ్వర, మహబూబ్ నగర్ టౌన్ షిప్ వెంచర్ తో పాటు వెంకటాద్రి వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసి మోస పోయిన వారికి తక్షణమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకొని, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. బాధితులు స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ భర్తపై నేరుగా ఆరోపణలు చేస్తున్న ఆయనపై విచారణ చేపట్టి చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. వెంకటాద్రి సి బ్లాక్ లో ఆక్రమణకు గురైన ప్లాట్లు దక్కాలంటే బాధితులు కోర్టుకు వెళ్లడం తప్ప మరే మార్గం లేదని సూచించారు. తాను చేపట్టబోయే సేవ్ జడ్చర్ల ఉద్యమంలో ప్రజలు భాగ్యస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ లీడర్లు అశోక్ యాదవ్, సర్ఫరాజ్, యాదయ్య, నిత్యానందం, బుక్క వెంకటేశం తదితరులు ఉన్నారు.


Next Story