రాజోలిలో కార్డెన్ సెర్చ్

by Dishafeatures2 |
రాజోలిలో కార్డెన్ సెర్చ్
X

దిశ, రాజోలి : మండల కేంద్రమైన కొత్త రాజోలిలో శనివారం జిల్లా ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ ఆదేశాల మేరకు శాంతినగర్ సీఐ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కార్డెన్ సెర్చ్ కొనసాగింది. సీఐ ఆధ్వర్యంలో 29 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇళ్లను సోదా చేశారు. ఈ తనిఖీలో ఎలాంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోలీసులు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరంసైబర్‌ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారి భద్రత కోసమే తాము కార్డెన్ సెర్చ్ పేరిట ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

కార్డెన్ సెర్చ్ తో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేరాల నియంత్రణ కొరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశామని తెలిపారు. నేరాలను అరికట్టడం, శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనబడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 100కి ఫోన్ చేయాలని సూచించారు. కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో శాంతినగర్ సీఐ శంకర్ గౌడ్, రాజోళి ఎస్సై లెనిన్, శాంతినగర్ ఎస్సై శ్రీనివాసులు, మానోపాడు ఎస్సై సంతోష్, అయిజ ఎస్సై నరేష్ కుమార్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed