మళ్ళీ పుట్టి చదువుకోవాలన్న కోరిక కలుగుతుంది: మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web |
మళ్ళీ పుట్టి చదువుకోవాలన్న కోరిక కలుగుతుంది: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ,వనపర్తి : ప్రభుత్వ పాఠశాలను చూస్తే తాను మళ్ళీ పుట్టి మళ్ళీ చదవాలి అన్న కోరిక కలుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో మన ఊరు - మన బడి పథకం ద్వారా రూ. 25లక్షల మూడు వేల రూపాయల వ్యేయంతో దరఖాస్తు చేసిన ఖిల్లా ఘణపురం ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌తో కలిసి ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించారు. ఉపాధ్యాయులకు విద్యార్థులను బోధించే సమయంలో ప్రాథమిక అంశాల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వ పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న బృహత్ సంకల్పంతో మన ఊరు- మన బడి పథకానికి శ్రీకారం చుట్టాలన్నారు.

రాష్ట్రంలో సుమారు 25 వేల ప్రభుత్వ పాఠశాలల దరఖాస్తుకు ఎంపిక చేశామని, మొదటి దశలో వనపర్తి జిల్లాలో సుమారు 183 పాఠశాలలలో 80 కోట్ల రూపాయల వ్యయంతో 12 రకాల సదుపాయాలను కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కష్టపడి సంపాదించే కుటుంబాలు తమ పిల్లల విద్య కోసం ప్రైవేట్ పాఠశాలలో డబ్బులను వృధా చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ పాఠశాలల సదుపాయాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుందనటానికి సుందరంగా రూపుద్దిద్దుకుంటున్న పాఠశాలలే నిదర్శనం అని తెలిపారు. రాష్ట్రంలో కేజీవీబీలు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులచే విద్య బోధన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో గురుకులాలలో అందిస్తున్న సదుపాయాలను చూసి తనకు అవకాశం ఉంటే మళ్లీ పుట్టి మళ్లీ చదవాలన్న కోరిక కలుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివించాలన్నారు. ఈ కార్యక్రమం లో ఖిల్లా ఘణపురం జెడ్పిటీసీ సామ్య నాయక్, ఎంపీపీ కృష్ణ నాయక్, వ్యవసాయ వైస్ మార్కెట్ చైర్మన్ బాళీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ జిల్లా అధికారి రవీందర్, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Next Story

Most Viewed