పదేళ్ల పాలనలో కాలయాపన తప్ప చేసిందేమీ లేదు : పొన్నం ప్రభాకర్

by Kalyani |
పదేళ్ల పాలనలో కాలయాపన తప్ప చేసిందేమీ లేదు  :  పొన్నం ప్రభాకర్
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో కాలయాపన తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. స్థానిక ఎఎస్ఎన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన గౌడ్ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మంత్రి జూపల్లి కృష్ణారావు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ప్రసంగించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని, ఆరోగ్యానికి సంబంధించి వైద్య పరంగా ఏమీ చేయలేదని, విభజన హామీలను పరిష్కరించలేదని ఆయన ఆరోపించారు.

ఒక్కప్పుడు మేడిగడ్డ తన మానస పుత్రిక అన్న కేసీఆర్ నేడు బొందల గడ్డ అంటున్నారని, దానిపై లక్ష కోట్ల రూపాయలను ఖతం చేశారని ధ్వజమెత్తారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం అర చేతిలో వైకుంఠ చూపించిందని, టీవీ, పత్రికలలో కోట్ల రూపాయలు గుమ్మరించి ప్రజాధనం దుర్వినియోగం చేసి గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గీత కార్మికుల బతుకులు దమనీయంగా ఉన్నాయని, వారి గురించి గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. గీత వనాలను పెంచేందుకు కృషి చేస్తామని భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హమీ ఇచ్చారు.

సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని, ఉమ్మడి జిల్లాకు జీవనాధారం అయిన కృష్ణా జలాలను ఆంధ్ర పాలకులు తరలించుకపోతుంటే చూస్తూ కూర్చున్న అసమర్థ దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుర్చీ వేసుకుని మూడేళ్ళలో పాలమూరు ప్రాజెక్టు ను పూర్తి చేస్తానని చెప్పి, 9 ఏళ్ళు అయిన పూర్తి చేయలేదని, ప్రాజెక్టు పనులు నాసిరకంగా జరుగుతున్నాయని,కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించి కక్ష పూరితంగా వ్యవహారించారని ఆయన విరుచుకుపడ్డారు.

వాస్తవానికి దక్షిణ తెలంగాణ ప్రాంత కృష్ణా బేసిన్ లో 68.5 శాతం కాష్టిక్ ఏరియా ఉంటే, ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 812 టీఎంసీ లలో ధర్మంగా మనకు 577 టీఎంసీ లు రావాలని, కాని 200 టీఎంసీ ల వాటాను ఒప్పుకొన్న దుర్మార్గుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. మన హక్కుల సాధనకై తనను పార్లమెంటు సభ్యుడు గా ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story